
తాగునీటి కోసం తండ్లాట
● రెండు నెలలుగా అందని నీళ్లు ● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ● గిరిజనులకు దికై ్కన వ్యవసాయ బోర్లు
హత్నూర (సంగారెడ్డి): ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్‌తో మిషన్ భగీరథ నీళ్లు అని ప్రజా ప్రతినిధులు, అధికారులు చేస్తున్న ప్రచారార్భాటాలు పటాటోపమేనని రుజువు చేస్తోంది హత్నూర మండలంలోని దేవునిగుట్ట తండావాసుల కన్నీటి గాథ. తండాకు మిషన్ భగీరథ నీళ్లు నిలిచిపోయి గత రెండు నెలలైనా ఈ గిరిజన వాసులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తాగునీటికోసం వ్యవసాయ క్షేత్రాల్లోని బోర్ల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఈ గిరిజన తండాలో సుమారు 300 జనాభాతో 45 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత ప్రభుత్వం ఈ దేవుని గుట్ట తండాను గిరిజన గ్రామపంచాయతీగా సైతం చేసింది. రక్షిత మంచినీటి ట్యాంక్ ఉన్నప్పటికీ చిన్నగా ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ రెండు నెలల క్రితం పగిలిపోవడంతో నీరు తండాకు రావడం లేదు. గిరిజనులు మిషన్ భగీరథ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. వ్యవసాయ బోర్ల నుంచి తాగునీరు తెచ్చుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడటంతోపాటుగా ఈ నీళ్లు తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు త్వరగా స్పందించి మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
మిషన్ భగీరథ త్రాగునీరు రాక రెండు నెలలైంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. నీటి కోసం ఇబ్బందులు పడుతూ పొలాల్లోని బోర్ల వద్దకు వెళ్తున్నాం.
– వాలి, తండా వాసి
కొత్త పైప్‌లైన్ వేస్తాం
దేవుని గుట్ట గిరిజన తండాకు త్వరలోనే కొత్త పైప్ లైన్ వేస్తాం. రెండు నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు ట్యాంకు ఎక్కడం లేదు. పైప్ లైన్ పగిలిపోవడంతో సమస్య తలెత్తింది.
–శివ ప్రసాద్, మిషన్ భగీరథ ఏఈ