
సాగుకు సింగూరు నీళ్లు
పుల్‌కల్(అందోల్): ఎట్టకేలకు సాగు కోసం సింగూరు జలాలు విడుదలయ్యాయి. సింగూరు జలాలను మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పూజలు చేసి లిఫ్టు ద్వారా ఎడమకాలువకు నీటిని విడుదల చేశారు. కాలువలకు సిమెంట్ లైనింగ్ మరమ్మతుల కారణంతో క్రాప్ హాలిడే ప్రకటించిన రాష్ట ప్రభుత్వం ఏడాది కాలంగా రెండు పంటలకు సింగూరు నీటిని విడుదల చేయని సంగతి తెలిసిందే. అయితే సిమెంట్ లైనింగ్ పనులు నత్తనడకన నడుస్తుండటంతో స్థానిక రైతుల ఆందోళనలను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం లైనింగ్ పనులకు తాత్కాలికంగా నిలిపి ఎట్టకేలకు సాగుకు సింగూరు జలాలు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ సాగునీటి వల్ల పుల్‌కల్,అందోల్,చౌటకూర్ మండలాల రైతులకు లాభం చేకూరుతుంది. ఆయకట్టు కింద 40 వేల ఎకరాల్లో, 93 చెరువుల కింద మరో 10వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారు. సాగు నీటి విడుదల అనంతరం మంత్రి దామోదర సింగూరు గురుకుల, బస్వాపూర్ మోడల్, కస్తూర్బా పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ పాఠశాలల ఆవరణలు చెత్తా చెదారం, పిచ్చి మొక్కలు పెరిగిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించడంతో ఆయా ప్రిన్సిపాళ్లను మంత్రి మందలించారు. ఆవరణలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ పాఠశాలల్లో ప్రతీ తరగతి గదిని పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో త్రిష దామోదర, నీటిపారుదల శాఖ ఈఈ జైభీమ్, డీఈ నాగరాజు, ఏఈలు మహిపాల్‌రెడ్డి, మహేశ్, తహసీల్దార్ కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ రాంచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
లిఫ్టు ద్వారా నీటిని విడుదల చేసిన
మంత్రి దామోదర