
గూడు లేదు.. గుంట భూమీ లేదు
పేదల దరి చేరని ప్రభుత్వ పథకాలు
● పూరి గుడిసెల్లో దుర్భర బతుకు ● కలల గూడు సాకారమయ్యేనా..!
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదోళ్ల తలరాతలు మాత్రం మారడం లేదు. పేరుకే పేదల కోసం పథకాలు.. కానీ వారికి మాత్రం పథకాలు అందడం లేదు. సాగు చేసేందుకు గుంట భూమి లేక.. ఉండేందుకు సరైన గూడు లేక ఏళ్లతరబడి గుడిసెలు, రేకుల కొట్టాల్లోనే జీవిస్తున్నారు. కూలీ చేస్తేనే కుటుంబ పోషణ.. లేదంటే ఉపవాసం ఉండాల్సిన దయనీయ పరిస్థితి వారిది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో కలల గూడు సాకారమవుతుందని కలలు కన్న పేదల పగటి కలగానే మిగిలిందని పేదలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని 28 మండలాల ప్రజలు ప్రజాపాలన కింద ఇందిరమ్మ ఇళ్లకు 2 లక్షల 30 వేల 483 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు ఇంటింటి సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. మూడు విభాగాలుగా లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు గ్రామ సభల ద్వారా కూడా ఎంపిక చేశారు. 86,968 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వనున్నారు. కాగా గుంట భూమి లేని వారు జిల్లాలో 16,505 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరిలో ప్రస్తుతం కొంతమందికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా ఇంకా చాలా మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. జగదేవ్‌పూర్ మండలంలో మొత్తం 29 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో గుంట భూమి లేని పేదలు దాదాపుగా యాభై కుటుంబాల వరకు ఉన్నాయి. ఇది అనధికారం మాత్రమే. అధికారంగా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. ప్రజాపాలనలో అందరిలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 9,585 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎల్ వన్ కింద 3319, ఎల్ టు 806, ఎల్ 5,460 విభజించారు. ఎల్ వన్ నుంచి పైలెట్ ప్రాజెక్టు గ్రామంలో 77 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. అలాగే మండల వ్యాప్తంగా 415 మందికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు.
గుంట భూమిలేదు
గుంట భూమి లేదు. భర్త, కొడుకు గ్రామంలో ఉపాధి హామీ పనులతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చిన్నపాటి రేకుల ఇంటిలోనే చాలా ఏళ్ల నుంచి తలదాచుకుంటున్నాం. వర్షాకాలం అయితే ఇంట్లోకి వర్షం నీరు వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకున్నాం. కానీ రాలేదు. మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే మంచిగుంటుంది.
– సంతోష, రాయవరం
ప్రభుత్వం స్పందించాలి
మాది చాలా నిరుపేద కుటుంబం. మండలంలోని ఎక్కడ మా కులపోళ్లు(దక్కలి) ఎక్కడ లేరు. ఇక్కడే ఉన్నం. కూలీనాలి పనులు చేసుకుంటూ ఉంటున్నాం. చేసిన కష్టం పూటకే సరిపోతుంది. పూరి గుడిసెలోనే ఉంటున్నాం. ప్రభుత్వమే స్పందించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
– సుగుణ, మునిగడప
విడతల వారీగా ఇళ్లు అందిస్తాం
అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తాం. ఇంటింటా సర్వే వివరాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరిగింది. అర్హులై ఇల్లు రానివారుంటే వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిశీలించి ఎంపిక చేస్తాం.
– రాంరెడ్డి, ఎంపీడీఓ జగదేవ్‌పూర్