
ఆదాయం కోసం ప్యాకేజీ అస్త్రం
దుబ్బాక: నష్టాల్లో ఉన్న డిపోలను లాభాల బాటలోకి తెచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ డిపోలకు ఆదాయ మార్గాలను సమకూర్చుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇందులో భాగంగా కొత్తగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తుంది. ప్యాకేజీల పేరిట ప్రయాణికులను ఆకర్షించుకునేందుకు యత్నిస్తోంది. దుబ్బాక డిపో నుంచి ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తూ ప్రయాణికులకు మంచి సౌకర్యంతో పాటు లాభాలు అర్జిస్తోంది.
దుబ్బాక టూ అరుణాచలం
దుబ్బాక బస్సు డిపో నుంచి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ప్రారంభించారు. ఇందులో భాగంగా జూన్ 27న ప్రముఖ పుణ్యక్షేత్రం తమిళనాడులోని అరుణాచలంకు దుబ్బాక నుంచి బస్సును ప్రారంభించారు. ఈ ప్యాకేజీ బస్సు ప్రయోగం సక్సెస్ కావడంతో ఇంకా మరిన్ని పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలనే ఆలోచనలతో పలు ప్రాంతాలకు కొత్తగా బస్సులు నడిపించేందకు ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి, అరుణాచలం, బీదర్‌లకు కొత్తగా బస్సులు
దుబ్బాక డిపో నుంచి అరుణాచలంతో పాటు తిరుపతి, బీదర్ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు బస్సులు నడిపించేందుకు డిపో అధికారులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా నెలకు రెండు పర్యాయాలు డిపో నుంచి ఈ టూర్లకు బస్సులు నడిపించేందుకు పథకాన్ని సిద్ధం చేశారు. ప్రతి నెలలో రెండు సార్లు సాయంత్రం 3 గంటలకు దుబ్బాక నుంచి అరుణాచంలకు డీలక్స్ బస్సు బయలు దేరుతుంది. సిద్దిపేట, హైదరాబాద్ మీదుగా జోగులాంబ ఆలయం, కాణిపాక ఆలయం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలంకు.. తిరుగు ప్రయాణంలో తిరుపతి దేవాలయాలు దర్శనం చేసుకొని 4 రోజులుకు తిరిగి దుబ్బాకకు చేరుకుంటుంది. ఇట్టి ప్యాకేజీలో సూపర్ లగ్జరీ బస్సు పెద్దలకు రూ.5,200, పిల్లలకు 2,700 నిర్ణయించారు. అలాగే దుబ్బాక టూ బీదర్‌కు ఝరాసంగంలోని సంగమేశ్వర ఆలయం, జల లక్ష్మీనర్సింహస్వామి బీదర్‌కు ఒక రోజు ప్యాకేజీతో డీలక్స్ బస్సును వేశారు. ఉదయం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు తిరిగి చేరుకుంటుందని, ఇందుకోసం పెద్దలకు రూ.1,100, పిల్లలకు రూ.600 ప్యాకేజీ పెట్టారు.
విస్తృతంగా ప్రచారం
దుబ్బాక డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు కొత్తగా ప్రారంభించిన టూర్ ప్యాజీలపై ఆర్టీసీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా, వాట్సాప్ ఫేస్‌బుక్‌లతో పాటు ఆకర్షణీయమైన కరపత్రాలతో టూర్లపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ గ్రామం నుంచైనా 36 మంది ప్రయాణికులుంటే ఆ గ్రామం లేద ఆ కాలనీ నుంచే బస్సు పెడుతామంటున్నారు. ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ముందుగా తమ పేర్లను బుక్ చేసుకోవాలి. ఇందు కోసం ప్రత్యేక నెంబర్లు 99592 26271, 86392 07675, 73828 29973 లను సంప్రదించాలి.
భక్తుల సౌకర్యార్ధం కోసమే..
భక్తుల సౌకర్యార్థం దుబ్బాక డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపుతున్నాం, అరుణాచలం, తిరుపతి, బీదర్ ప్రాంతాల్లోని ప్రముఖ పుణక్షేత్రాలకు బస్సులు వేయడం జరిగింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరించాలి.
– రఘురాం, డీఎం
ఆర్టీసీ వినూత్న ప్రయోగం దుబ్బాక డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు ప్రత్యేక టూర్ ప్యాకేజీలతో ఆకర్షించుకునేందుకు యత్నం
అరుణాచలం, తిరుపతి, బీదర్ తదితర టూర్లకు బస్సులు