
మాటువేసి కత్తితో దాడి
● వ్యక్తికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
రాయికోడ్(అందోల్): ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని పీపడ్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మణ్ బుధవారం రాత్రి తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ముందుగానే మాటువేసిన ఇస్మాయిల్ పదునైన కత్తితో లక్ష్మణ్ కడుపులో పొడిచాడు. దీంతో పేగులు బయటకు వచ్చి తీవ్ర రక్తస్రావమైంది. భయాందోళనతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన లక్ష్మణ్.. పెద్దగా కేకలు వేస్తూ ఇంటికి చేరుకున్నాడు. వెంటనే అతడిని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు, ఎస్‌ఐ నారాయణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.