
చిట్టితల్లి తలకొరివి పట్టి..
వర్గల్(గజ్వేల్): తండ్రి మరణం.. పుట్టెడు దుఃఖం తనలోనే దిగమింగుకుంది. తానే కొడుకై ంది.. తలకొరివి పట్టింది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించి కన్నతండ్రి రుణం తీర్చుకున్నది. వర్గల్ మండలం అనంతగిరిపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. గ్రామానికి చెందిన బండ్ల సత్యనారాయణ(40), కవిత దంపతులకు కల్యాణి(18), ఉమ(15), శ్రావణి(13) ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దురదృష్టం వెన్నంటి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముకకు గాయంతో మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న కొద్దిపాటి భూమిలో కొంత అమ్మేసి వైద్యం చేయించన్పటికి నయం కాలేదు. ఇటీవలే మరికొంత భూమి అమ్మి పెద్దకూతురు పెండ్లి చేశారు. మరోవైపు సత్యనారాయణ ఆరోగ్యం మరింత విషమించింది. బుధవారం మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్దదిక్కును, మగ దిక్కును కోల్పోయింది. దుఃఖసాగరంలో మునిగిపోయింది. కొడుకులు లేకపోవడంతో చిన్నకూతురు శ్రావణి దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం తలకొరివిపట్టింది. తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. తండ్రి రుణం తీర్చుకున్నది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది.
కన్నతండ్రి అంత్యక్రియలు నిర్వహించి..
రుణం తీర్చుకున్న తనయ
అనంతగిరిపల్లిలో విషాదం