
తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి
● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ ● అధికారులతో సమీక్ష
సంగారెడ్డి జోన్: గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ స్పష్టం చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, రోడ్లు భవనాలు, శిశు సంక్షేమ, విద్యా, వైద్య ఆరోగ్య, వ్యవసాయం, జిల్లా గ్రామీణ సంస్థ, నీటిపారుదల, పరిశ్రమలు, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ...గ్రామీణ ప్రాంతాలు గిరిజన తండాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికి విద్యా, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు జ్యోతి, లలిత కుమారి, జానకీరెడ్డి, వసంత కుమారి, ఐనేష్ పాల్గొన్నారు.
10 నెలల్లో రోడ్డు, వంతెన పూర్తి చేయాలి
కల్హేర్(నారాయణఖేడ్): అంతకుముందు సిర్గాపూర్ మండలం గైరాన్ తండాను సందర్శించారు. తండాకు రోడ్డు, వంతెన నిర్మాణం పనులు 10 నెలల్లో పూర్తి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ అధికారులను ఆదేశించారు. సిర్గాపూర్ మండలం గైరాన్ తండాలో గిరిజనులతో మాట్ల్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్టీ కమిషన్ ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. లేకుంటే అధికారులు న్యూఢిల్ల్లీలో ఎస్టీ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు.