
కారు బోల్తా.. బాలిక మృతి
పాపన్నపేట(మెదక్): కారు బోల్తాపడి బాలిక మృతి చెందింది. ఈ ఘటన ఏడుపాయల ఆలయ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన కొత్తూరి ప్రతిమ (17)ఇంటర్ పూర్తి చేసింది. కొంత కాలంగా నగరంలోని ఫతేనగర్ ప్రాంతానికి చెందిన గొల్ల చింటూ (17) ప్రతిమను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ విషయంలో ఇదివరకు రెండు , మూడు సార్లు ప్రతిమ కుటుంబీకులు అతన్ని మందలించారు. అయినా అతని తీరు మారలేదు. ఈ క్రమంలో శనివారం ప్రతిమ ఇంట్లో చెప్పకుండా చింటూతో వెళ్లింది. అతని స్నేహితులు మనోహర్, శివకుమార్‌తో కలిసి నలుగురు ఇన్నోవా కారులో ఏడుపాయలకు వచ్చారు. చింటూ కారు నడుపుతుండగా, ప్రతిమ, మనోహర్, శివకుమార్ వెనుక కూర్చున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో భోజనం చేయడానికి పోతంషెట్పల్లి వైపు వెళ్తుండగా, ఏడుపాయల బస్టాండ్ సమీపంలో అతివేగంగా వెళ్తూ, కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అటుగా వెళ్లినవారు 108కు సమాచారం ఇచ్చారు. వెంటనే క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ప్రతిమ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చింటూ, మనోహర్, శివకుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా తమ కూతురి చావుకు చింటూనే కారణమని మృతురాలి తండ్రి అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతిమ మృతదేహం

కారు బోల్తా.. బాలిక మృతి