
భూ తగాదాలో స్నేహితుడి హత్య
కల్హేర్(నారాయణఖేడ్): భూ తగాదాలో స్నేహితుడు దారుణ హత్యకు గురయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ హన్మండ్లు, కుర్మ రమేష్ కుటుంబీకుల మధ్య దారి విషయంలో భూ తగాదా జరుగుతోంది. కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉన్నాయి. భూ తగాదా విషయమై గ్రామంలో ఆదివారం ఉదయం పంచాయతీ జరిగింది. పంచాయతీలో సమస్య పరిష్కారం కాలేదు. మధ్యాహ్నం కుర్మ రమేష్, కర్పట్ల జైపాల్ కలిసి వ్యవసాయ భూమికి వెళ్లారు. రమేష్‌కు జైపాల్ సహకరిస్తున్నాడని ఇద్దరిని అంతం చేయాలని కుర్మ హన్మండ్లు కుటుంబీకులు పథకం రచించారు. అప్పటికే ఇద్దరి రాక కోసం మార్గమధ్యలో వేచిచేస్తున్నారు. ఇరువురి మధ్య మాటలతో గొడవ మొదలైంది. గొడ్డలి, మరణాయుధాలతో వారిద్దరిపై దాడి చేయగా దాడిలో జైపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. రమేష్‌కు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని కంగ్టీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకట్‌రెడ్డి, దుర్గ రెడ్డి, వెంకటేశం పరిశీలించారు. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేసేందుకు క్లూస్ టీంను రంగంలోకి దింపారు. మృతుడు జైపాల్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలం వద్ద మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
మరొకరికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లాలో ఘటన

భూ తగాదాలో స్నేహితుడి హత్య