
సెంట్రల్ బ్యాంకులో చోరీకి యత్నం
వెల్దుర్తి(తూప్రాన్): బ్యాంకులో చోరీకి యత్నించి అలారం మోగడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ఆదివారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు బ్యాంక్ వెనకవైపు స్టోర్ రూం గోడకు కన్నం చేసి ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో బ్యాంకును అనుక్షణం పర్యవేక్షించే ఐవీఎస్ టీం అలర్ట్ అయి అలారం మోగడంతో దుండగులు గోడకు వేసిన కన్నం ద్వారా పరారయ్యారు. అదే సమయంలో డయల్ 100 ద్వారా పోలీసులను అలర్ట్ చేయడంతో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, క్లూస్ టీం, బ్యాంక్ మేనేజర్ సుమన్ భాగే, సిబ్బందితో ఘటనా స్థలాన్ని సందర్శించి వేలిముద్రలు సేకరించారు. నిందితులిద్దరూ ముఖానికి మాస్కులు ధరించినట్లు తెలిసింది. చోరీలో ఇద్దరు దుండగులే పాల్గొన్నారా? లేక బయట ఎవరైనా కాపలాగా ఉన్నారా? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. డీఎస్పీ వెంట తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, వెల్దుర్తి ఎస్సై రాజుతో పాటు మనోహరాబాద్, శివంపేటకు చెందిన పోలీస్ సిబ్బంది ఉన్నారు. గతంలో కూడా ఓ యువకుడు చోరీకి ప్రయత్నించగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించి కేసు నమోదు చేశారు.
గోడకు కన్నం చేసి లోనికి వచ్చిన దుండగులు
అలారం మోగడంతో పరారీ