
అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
సంగారెడ్డి క్రైమ్: కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పట్టణంలోని రుక్మిణి థియేటర్ వద్ద గల డ్త్రెనేజీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించి మేనేజర్ వెంకటేశం పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో పట్టణంలోని విజయ్‌నగర్ కాలనీకి చెందిన కడమంచి దుర్గాప్రసాద్ (23)గా గుర్తించారు. ఇతడు వృత్తిరీత్య కూలీ పనులు చేసుకుంటున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ చిన్నారి..
జహీరాబాద్ టౌన్: చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామానికి చెందిన లక్ష్మణ్ కుటుంబంతో జహీరాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. జూన్ 22న ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో లక్ష్మణ్ రెండవ కుమార్తె షరోని(7) గాయపడింది. ప్రమాదవశాత్తు దీపం చిన్నారిపై పడి మంటలు అంటుకున్నాయి. కుటుంబ సభ్యులు చూసి మంటలను ఆర్పేలోపు గాయాలయ్యాయి. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.