
కాలేజీకి రోడ్డు నిర్మించరూ?
నెలలు గడిచినా
పూర్తి కాని పనులు
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్‌కు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కావడం ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. కాలేజీ తరగతులను ఇప్పుడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రారంభించనున్నారు. 2017లో ప్రారంభమైన పాలిటెక్నిక్‌కు 2023 ఎన్నికల ముందు డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ.90లక్షలను కలెక్టర్ మంజూరు చేసి టెండర్లు పిలిచారు. కానీ నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు చేయడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం మారడంతో రోడ్డు మంజూరు పనులు మళ్లీ మొదటికీ వచ్చాయి. కాలేజీ ప్రిన్సిపాల్ విజ్ఞప్తి మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు కాలేజీ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఈజీఎస్‌లో రూ.50లక్షల నిధులు మంజూరు చేయించారు. మార్చిలో కాలేజీ ముందు రెండు ట్రిప్పర్ల కంకర పోసిన కాంట్రాక్టర్ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. పాలిటెక్నిక్ అడ్మిషన్లు, ఇంజినీరింగ్ అడ్మిషన్లు జరుగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరగనుంది. కాలేజీ వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, లెక్చరర్లు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ ప్రజాప్రతినిధికి బంధువు కావడంతో అధికారులు పనులు చేయాలని అడగడానికి వెనుకడుగు వేస్తున్నారు.