పనులు ప్రారంభించాలి
డబుల్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా ప్రారంభించాలి. కొమురవెల్లి దేవస్థానానికి ఈ రోడ్డు మార్గంలోనే వెళ్తుంటారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు వెళ్లడంతో రద్దీగా ఉంటుంది. సింగిల్ రోడ్డు కావడంతో రాత్రి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు దృష్టి సారించి పనులు వెంటనే చేపట్టాలి.
– లింగాల శ్రీనివాస్,
మాజీ ఎంపీటీసీ, రామవరం గ్రామం
త్వరలో ప్రారంభిస్తాం
హుస్నాబాద్ మీదుగా రామవరం గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఇటీవల కాంట్రాక్టర్‌తో కూడా మాట్లాడినం. పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించాం. ఐదారు రోజుల్లో రోడ్డు విస్తరణ పనులు చేపడతాం.
– రాహుల్, ఏఈ ఆర్‌అండ్‌బీ
అక్కన్నపేట(హుస్నాబాద్): రోజురోజుకు వాహనాల సంఖ్య పెరగడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు సింగిల్ రోడ్లు మాత్రమే ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తా నుంచి గౌరవెల్లి మీదుగా రామవరం గ్రామం వరకు ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చేందుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనవరిలో రామవరంలో శంకుస్థాపన చేశారు. ఈ డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారుగా రూ.25కోట్ల నిధులు మంజూరు చేశారు. కాగా శంకుస్థాపన చేసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అయితే హుస్నాబాద్ నుంచి రామవరం వరకు సుమారుగా 17కిలో మీటర్లు ఉంటుంది.
కొమురవెల్లి దేవస్థానానికి దారి
హుస్నాబాద్ మీదుగా గౌరవెల్లి గ్రామం నుంచి కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి రోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. సింగిల్ రోడ్డు మాత్రమే ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలను పక్కకు తప్పించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా గౌరవెల్లి గ్రామం రోడ్డంతా గుంతలమయంగా ఉంది. ఈ ఒక్క ఊరు దాటడానికే దాదాపు 20నిమిషాల సమయం పడుతుందని వాహనదారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
హుస్నాబాద్– రామవరం డబుల్ రోడ్డుకు మోక్షమెప్పుడో
రూ.25కోట్లు నిధులు మంజూరు
కన్నెత్తి చూడనీ అధికారులు
శంకుస్థాపన ఘనం.. పనులు శూన్యం