మన సంగతి సరే.. వాళ్లు వెల్‌కం చెప్పారు విభిన్నంగా..

Special Story On Foreigners Different New Year Wishes - Sakshi

అందరూ న్యూఇయర్‌కు వెల్‌కం చెప్పేశాం.. ఒక్కొక్కరూ ఒక్కో టైపులో... చాలామందికి కొత్త సంవత్సరం తొలిరోజున ఫలానా పని చేస్తే.. ఆ ఏడాదంతా కలిసి వస్తుందని నమ్మకాలు ఉంటాయి. అందులో భాగంగానే చాలామంది ఆలయాలకు వెళ్తుంటారు. మన సంగతి సరే.. మరి విదేశాల్లోని సంగతేంటి? వాళ్ల సంప్రదాయాలు ఏంటి? సెంటిమెంట్లు ఏంటి? తెలుసుకుందామా.. 

ఆ 12 ద్రాక్షలు..
‘నోచె వీజా’.. అంటే స్పానిష్‌ భాషలో పాత రాత్రి అని అర్థం. స్పెయిన్‌లో ఏటా న్యూఇయర్‌ సందర్భంగా ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే కొత్త ఏడాది తమకు అదృష్టం తెచ్చిపెట్టాలని కాంక్షిస్తూ 12 ద్రాక్షపండ్లను తినడం ఆనవాయితీ.

లక్‌ను తెచ్చే లోదుస్తులు.. 
బ్రెజిల్‌ పౌరులది మరీ విచిత్రమైన సంప్రదాయం.. కొత్త సంవత్సరం తమకు అదృష్టాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటూ ప్రజలు రంగురంగుల లోదుస్తులు ధరించారు. ఒక్కో లోదుస్తుల రంగు ప్రేమ, వాత్సల్యం, ఆరోగ్యం మొదలైన వాటికి చిహ్నంగా నిలుస్తాయని వారి నమ్మకం.

ఆలూ ఏం చెబుతోంది.. 
కొలంబియన్లు కొత్త ఏడాది సందర్భంగా తమ దిండ్ల కింద పూర్తిగా చెక్కు తీసిన, సగం చెక్కు తీసిన, చెక్కు తీయని మూడు ఆలుగడ్డలను పెట్టుకున్నారు. ఒక్కో ఆలుగడ్డను ఆర్థిక సమస్యలు, సమృద్ధి, శ్రేయస్సు–నిరాశకు మధ్య సమతూక సంకేతంగా పరిగణించారు. న్యూఇయర్‌ రాత్రి దిండ్ల కింద పెట్టిన మూడు ఆలుగడ్డల్లోంచి ఒకదాన్ని కళ్లు మూసుకొని తీశారు. ఒక్కో వ్యక్తి తీసుకొనే ఆలుగడ్డ ఆ సంవత్సరమంతా అతని లేదా ఆమె తలరాతను సూచిస్తుందని భావిస్తున్నారు.

ఉల్లి చేసే మేలు.. 
గ్రీస్‌లో న్యూఇయర్‌ను పురస్కరించుకొని ప్రజలు ‘వసిలోపిటా’ అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కేక్‌ను శిలువ ఆకారంలో మూడుసార్లు కోసి సెయింట్‌ బేసిల్‌ అనే తొలినాళ్లకు చెందిన బిషప్‌కు అంకితమిచ్చారు. అలాగే ఏడాదంతా తమకు అదృష్టం తెచ్చిపెట్టాలని ఇళ్ల తలుపులకు కొన్ని ఉల్లిగడ్డలను వేలాడదీశారు. ఉల్లిని నిరంతర వృద్ధి, ఎదుగుదలకు చిహ్నంగా భావిస్తూ ఇలా చేశారు.

108 సార్లు వాయిస్తే.. 
కొత్త ఏడాది నూతన ప్రారంభానికి సూచికగా జపనీయులు గుళ్లలో 108సార్లు గంటలను మోగించారు. మనిషిలోని కోరికలు, ఆందోళనలను పరిశుద్ధం చేసుకొనేందుకు సంకేతంగా 108సార్లు గంటలు వాయిస్తారు.

ఉప్పుతో స్వాగతం...
టర్కీవాసులు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటి తలుపులపై ఉప్పును చల్లుతూ కొత్త ఏడాదంతా తమకు శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకున్నారు.

గోడకేసి కొట్టేద్దాం..
ఐర్లాండ్‌లో కొందరు ప్రజలు దుష్టశక్తులు, దురదృష్టాన్ని పారద్రోలేందుకు క్రిస్మస్‌ బ్రెడ్‌ను తమ ఇళ్ల గోడలపై విసిరి కొట్టారు. తద్వారా వారు కొత్త ఏడాదిని స్వచ్ఛంగా ప్రారంభిస్తున్నట్లు భావిస్తారు.

గిన్నెలు, గ్లాసులు బద్దలుకొట్టి...
డెన్మార్క్‌ ప్రజలు న్యూ­ఇ­యర్‌ను పురస్కరించుకొని తమ పాత ప్లేట్లు, గ్లాసు­లను ఇరుగుపొరుగు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇళ్ల తలు­పులకేసి పగలగొట్టారు. తలుపుల వద్ద ఎన్ని పగిలిన ముక్కలు పడితే కొత్త ఏడాదంతా తమకు అంత బాగుంటుందని వారు విశ్వసిస్తారు.

రంగురంగులతో కొత్త కళ...
మెక్సికోవాసులు కొత్త ఏడాది రాక సందర్భంగా తమ ఇళ్లను సరికొత్త రంగులతో తీర్చిదిద్దారు. ప్రేమ కోసం పరితపించే వారికి ఎరుపు, కొత్త ఉద్యోగాన్వేషణ చేసే వారికి పసుపు.. ఇలా వివిధ రంగులు ప్రత్యేక సందేశాలను చాటుతాయని వారు భావిస్తారు. 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top