వరదల్లో ఉన్న పాక్‌.. జలసమాధి కానుందా? తరిగిపోతున్న హిమాలయాలు.. భారత్‌ పరిస్థితి ఏంటసలు?

Heat Waves Affect: Himalayan Glaciers Melt worsed Pak Situation - Sakshi

దాయాది దేశం పాక్‌కు మరో ఉపద్రవం వచ్చి పడనుంది. ఇది ఊహ కాదు.. తీవ్ర హెచ్చరికలు. ఇప్పటికే తీవ్ర వర్షాలు, భారీ వరదలతో మూడింట వంతు పాక్‌ నీటిలోనే ముగినిపోయి ఉంది. వెయ్యి మందికిపైగా ప్రాణాలు.. మూడు కోట్ల మంది నిరాశ్రయలు అయ్యారు. అయితే.. రాబోయే రోజుల్లో మరో భారీ ముప్పు పాక్‌కు పొంచి ఉందని భారత సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది భారత్‌కు సైతం పరోక్ష హెచ్చరికగా పేర్కొంటున్నారు.

సాధారణంగా వర్షాకాలపు సీజన్‌ కంటే.. ఈసారి పదిరెట్లు అధికంగా అక్కడ వర్షాలు కురిశాయి. దీంతో పాక్‌ సగానికి కంటే ఎక్కువ భాగం నీటమునిగింది. సహాయక చర్యల్లో భాగంగా.. హెలికాఫ్టర్లు ల్యాండ్‌ అయ్యేందుకు భూభాగం కూడా దొరకట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలడం.. ఇతర సమస్యలతో పాక్‌ ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా నష్టం వాటిల్లింది అక్కడ. అలాంటిది పుండు మీద కారంలాగా.. ఇప్పుడు హిమనీ నదాలతో పెను ప్రమాదం పొంచి ఉంది ఆ దేశానికి!.

ఇండోర్‌ ఐఐటీ పరిశోధకుల ప్రకారం.. 
ఇండోర్‌ ఐఐటీ గ్లేసియాలజిస్టుల బృందం వెల్లడించిన నివేదికల ప్రకారం.. గత వందేళ్ల రికార్డును తుడిచిపెట్టేసి మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతల కారణంగా వేడి గాలులు సంభవించాయి. ఈ ప్రభావంతో.. హిమాలయాల్లో రికార్డుస్థాయిలో హిమానీనదం కరిగిపోయి.. ఇప్పటికే వరదల్లో మునిగి ఉన్న పాక్‌ను ప్రళయ రూపేణా మరింతంగా ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. 

ఎల్‌ నినా ప్రభావం
పాకిస్తాన్‌లో తీవ్రమైన రుతుపవనాల కారణంగా పరిస్ధితి దారుణంగా మారింది. వేడెక్కుతున్న అరేబియా సముద్రం, లా నినా ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. హిమాలయ హిమానీనదం కరిగిపోయే ప్రభావం.. పాక్‌ భూభాగంలో ఉన్న 7,000 హిమానీనదాలపై ప్రభావాన్ని చూపెట్టనుందని అంటున్నారు. 

ఆ వెంటనే మరొకటి
వరదల రూపంలో మహా ప్రళయం ముంచెత్తి.. పాక్‌ను ఎంత డ్యామేజ్‌ చేస్తుందో తెలియదు. కానీ, ఆ తర్వాత తీవ్రమైన కరువు కచ్చితంగా పాక్‌ను మరింతగా దిగజారస్తుంది అని చెప్తున్నారు ఇంటర్నేషనల్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో పాక్‌ ప్రతినిధి మోషిన్‌ హఫీజ్‌. క్లైమేట్‌ చేంజ్‌ విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదవ దుర్బలమైన(హాని పొందే అవకాశం ఉన్న) దేశం. అలాంటి భూభాగంలో.. వాతావరణ మార్పులతో వరదలు, కరువు వెనువెంటనే సంభవించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. 

హిమాచల్‌ ప్రదేశ్‌లో హిమాలయాలపై ఛోటా షిగ్రీ గ్లేసియర్‌పై అధ్యయనంలో భాగంగా.. గత పదిహేను సంవత్సరాల పరిస్థితులను ఆధారంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు ఇండోర్‌ ఐఐటీ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. హిమానీనదం కరిగిన ప్రభావంతో.. పరిశోధనా కేంద్రం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఈ కేంద్రాన్ని జూన్‌లో ఏర్పాటు చేస్తే.. ఆగస్టులో వరదలకు  నామరూపాలు లేకుండా పోయింది.

► గ్లోబల్‌ వార్మింగ్‌.. ఊహించని స్థాయిలో వడ గాల్పుల ప్రభావం యూరప్‌ ఆల్ఫ్స్‌తో పాటు హిమాలయ పరిధిలోని మంచును సైతం కరిగించేస్తోంది. అయితే హిమాలయాల్లో గ్లేసియర్లు సైంటిస్టుల ఊహకంటే దారుణంగా కరిగిపోతూ వస్తున్నాయి. 

► ఈ ప్రభావం పాక్‌పైనే ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే నగరాలు, పంటపొలాలతో సహా అంతా ముగినిపోగా.. రాబోయే విపత్తులను తల్చుకుని పాక్‌ ప్రజలు వణికిపోతున్నారు.

► హిమాలయాల నీరు.. ఎనిమిది దేశాలు.. 1.3 బిలియన్ల ప్రజలకు తాగు-సాగు నీటిని అందిస్తోంది.

► టిబెట్‌ నుంచి మొదలయ్యే సింధు నదీ పరీవాహక ప్రాంతం.. పాక్‌ గుండా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది ఫ్రాన్స్‌ కంటే రెండింతల పరిమాణంలో ఉండి.. పాక్‌కు 90 శాతం ఆహారోత్పత్తులను అందిస్తోంది. 

► బేసిన్ వరదలు వచ్చినప్పుడు, చాలా నీరు మట్టిలోకి ప్రవేశించకుండా సముద్రంలోకి ప్రవహిస్తుంది. కాబట్టి.. నీటి కొరత ఏర్పడుతుంది. 2050 నాటికి దక్షిణాసియాలో 1.5 బిలియన్ల నుండి 1.7 బిలియన్ల మంది ప్రజలకు నీటి సరఫరా క్షీణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం అంచనా వేసింది.

► వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించేందుకు పాకిస్థాన్ మరింత మెరుగ్గా వ్యవహరించాలి. విపత్కర పరిస్థితుల్లో స్పందించేందుకు కఠిన చర్యలు చేపట్టాలి. అయితే తనంతట తానుగా వ్యవహరించే సత్తా పాక్‌కు లేదని మోషిన్‌ హఫీజ్ చెప్తున్నారు.

► వరదలు, కరువు ఏనాటి నుంచో మనిషి మనుగడపై ప్రభావం చూపెడుతున్నాయి. కానీ, భూమి వేడెక్కడం అనే వ్యవహారంతో పెరిగిపోవడం మాత్రం మానవ తప్పిదాలతోనే అనే వాదనను మరింతగా వినిపిస్తోంది. 

► ప్రకృతి విపత్తుల నుంచి  ఉపశనమం పొందేందుకు పాక్‌కు సాయం అందొచ్చు. కానీ, ఆర్థిక సమస్యలు మాత్రం ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడం లేదు. 

► ఈ సంవత్సరం వేడిగాలుల ప్రభావం, పాకిస్తాన్‌లో భారీ వరదలు.. ఒక హెచ్చరిక లాంటిది.. మనిషి వెనక్కి తిరిగి చూస్కోవాల్సిన తరుణం అని భారత్‌కు చెందిన హిమానీనద శాస్త్రవేత్త(గ్లేసియోలజిస్ట్‌) ఆజం చెప్తున్నారు. 

► నేపాల్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటీగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం.. 2100 సంవత్సరాల నాటికి హిమాలయాలు 60 శాతం కరిగిపోతాయని అంచనా. 

► భారత దేశంలో 16 శాతం హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 33% థర్మల్ విద్యుత్,  52% జలవిద్యుత్ హిమాలయలో పుట్టే నదుల నీటిపై ఆధారపడి ఉంది. మంచు కరగడం వల్ల ఈ నదులు తమ నీటిలో గణనీయమైన భాగాన్ని పొందుతున్నాయి, హిమానీనదాలు భారతదేశ ఇంధన భద్రతలోనూ అనివార్యమైన భాగంగా ఉన్నాయి. అలాంటిది హిమాలయాలు మాయమైపోతే!..‍ నష్టం ఊహించనిదిగా ఉండనుంది.

► గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో.. అడవులు తగలబడిపోవడం, మంచు కరిగిపోవడం.. భారీ వర్షాలు, చైనా కరువుకాటకాలు.. ఇవన్నీ ప్రపంచ దేశాలకు మేలు కొలుపు.  1.1 డిగ్రీ సెల్సియెస్‌ ఉష్ణోగ్రత పెరగడం.. లో-మీడియం ఇన్‌కమ్‌ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపెడుతుందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top