గంజాయిపై ఉక్కుపాదం
మోపుతున్న పోలీసులు
కొత్తూరు: ఒకప్పుడు పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే వెలుగు చూసే గంజాయి, ఇతర మత్తు పదర్థాల విక్రయాలు క్రమంగా పల్లెలకూ పాకుతున్నాయి. ప్రభుత్వం నిషధిత మత్తు పదార్థాల విక్రయాలు, సేవనాన్ని పూర్తిగా నిషేధించింది. వాటిపై గట్టి నిఘా పెట్టడంతో పాటు ప్రత్యేక సిబ్బందిని సైతం ఏర్పాటు చేసింది. కొత్తూరు పట్టణంలో ఇప్పటికే స్థానిక పోలీసులు నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నెల పరిధిలోనే పలువురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొత్తూరు ఏసీపీ డివిజన్‌గా మారడంతో మత్తు పదార్థాల విక్రయాలపై మరింత నిఘా పెరిగే అవకాశం ఉంది.
గుట్టుగా విక్రయాలు
పట్టణంలో ఐదేళ్ల క్రితం వరకు గంజాయి కేసులు అంతగా నమోదు కాలేదు. మూడేళ్ల పరిధిలో వరుసగా గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఏర్పాటు చేసిన చిన్నచిన్న కిరాణ దుకాణాలు, పాన్‌డబ్బాల్లో విక్రయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పట్టణంలో ఎక్కువగా ఒడిశా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారు. వీరు పరిశ్రమల్లో పనిచేస్తూ మత్తుకోసం గంజాయి వినియోగిస్తున్నట్లు పలు కేసుల్లో తేలింది. ఈ క్రమంలో కార్మికుల కుటుంబ సభ్యుల నుంచి నెమ్మదిగా స్థానికులు పార్టీలు, ఇతర విందులు, వినోదాల్లో వినియోగించడం ప్రారంభమైంది. యువకులు సైతం గంజాయి, గంజాయితో చేసిన చాక్లెట్లు వాడుతున్నారు.
ఇటీవల నమోదైన కేసులు
● 2024 జనవరి 11న పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తుగా కనిపించడంతో దృష్టి పెట్టిన ఉపాధ్యాయులు వారు ఏవో చాక్లెట్లు తింటున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో పోలీసులకు తెలపడంతో విద్యార్థులు కొనుగోలు చేసిన పాన్‌డబ్బాపై తనిఖీలు నిర్వహించి పెద్దమొత్తంలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
● ఈ ఏడాది సెప్టెంబర్ 8న స్థానిక పోలీసులు ఇన్ముల్‌నర్వ శివారులో పీఅండ్‌జీ పరిశ్రమకు వెళ్లే రోడ్డులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ధృవ్‌జోషి (30) అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించి అతడి నుంచి సుమారు రూ.1.42 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
● సెప్టెంబర్ 12న స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు పట్టణంలోని హనుమాన్ ఆలయం సమీపంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన భోలా, సుమనాత్రిదేవి ఇంట్లో తనిఖీలు నిర్వహించి 78 గంజాయి చాక్లెట్లను గుర్తించి భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.
● సెప్టెంబర్ 25న స్థానిక పోలీసులు పాత జాతీయ రహదారి పారిశ్రామికవాడ కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా బిహార్‌కు చెందిన గోలు కుమార్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని అతడి వద్ద ఉన్న బ్యాగులో చూడగా 29 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇప్పటికే పలువురు విక్రేతల అరెస్టు.. కేసుల నమోదు
తాజాగా కొత్తూరు ఏసీపీ డివిజన్‌గా మారడంతో మరింత పెరగనున్న నిఘా
కఠినచర్యలు తీసుకుంటాం
గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు విక్రయించడం, సేవించడం నేరం. వీటిని విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు, వ్యాపారులు సహకరించాలి.
– నాగార్జునరెడ్డి, సీఐ కొత్తూరు


