అబ్దుల్లాపూర్‌మెట్: బతుకమ్మ ఈవెంట్‌లో పాల్గొని తిరుగు పయనమైన మిమిక్రీ కళాకారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ సాయినగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ (40) మిమిక్రీ కళాకారుడు. 15 ఏళ్లుగా 2000 ప్రదర్శనలు చేసిన ఆయన వెంట్రిలాక్విజం, మ్యాజిక్‌లోనూ ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆదివారం అర్థరాత్రి హఫీజ్‌పేట సమీపంలో జరిగిన బతుకమ్మ ఈవెంట్ ముగించుకొని తిరిగి తన కారులో ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా హయత్‌నగర్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. రాత్రి 1.30 గంటల సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం సత్యనారాయణ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడడంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటువైపు వెళ్తున్న వాహనదారులు పోలీసులు, 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న సత్యనారాయణ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడుగా సత్యనారాయణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు.
కుప్పకూలిన భారీ వృక్షం
హుడాకాంప్లెక్స్: సరూర్‌నగర్ చౌడి వద్ద భారీ వృక్షం సోమవారం అకస్మాత్తుగా కూలిపోయింది. రాత్రి 9 గంటల సమయంలో చెట్టు కూలిపోగా ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, మనుషులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును పక్కకు తొలగించారు.
కబడ్డీ టోర్నీ రన్నరప్ జిల్లా జట్టు
అశ్వారావుపేట: రాష్ట్ర స్థాయి అండర్–20 బాలికల కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మూడు రోజులుగా సాగుతున్న పోటీలు సోమవారంతో ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో రంగారెడ్డి జట్టుపై నల్లగొండ విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి ట్రోఫీలు అందజేశారు.


