బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ హయాంలోనే అభివృద్ధి

Oct 13 2026 11:43 AM | Updated on Oct 13 2026 11:43 AM

వికారాబాద్‌: ‘తెలంగాణ ప్రజల నాలుగు దశాబ్దాల రాష్ట్ర కలను కేసీఆర్‌ నిజం చేసిండు.. గడిచిన దశాబ్ద కాలంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించిండు.. చిన్న జిల్లాలు, రెవెన్యు డివిజన్లు, కొత్త మండలాలు, తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి పాలనను ప్రజల ముంగిటకు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది’ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా దశాబ్ది ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వికారాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే.. కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. మెడికల్‌ కాలేజీ ఇచ్చింది.. ఆయూష్‌ ఆస్పత్రి కట్టింది.. జిల్లా చేసింది.. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు కట్టింది.. రైల్వే ఫ్లై ఓవర్‌ మంజూరు చేసింది మేమేనని అన్నారు. 24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక ఏం చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్‌ విసిరారు.. మోసపోతే గోస పడతామని నాడు కేసీఆర్‌ చెప్పిందే నేడు నిజమైందన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు, సీఎం బ్రదర్స్‌ ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు లాక్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే కబ్జాదారు అయితే రైతులు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. పంటల వేసుకోవద్దని మంత్రులే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వానికి నీళ్లు, కరెంటు ఇచ్చే సోయి లేదని మండి పడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పాలమూరు ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయితే మిగిలిన పది శాతం పనులు పూర్తి సాగు నీరు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నేడు సీఎం నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. పవర కట్‌ చేసి పంటలు ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి మహిళకూ నెలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లక్ష కోట్లతో మూసీ ప్రక్షాళన అంటున్న సీఎం వికారాబాద్‌లో మూసీ కలుషితం కాకుండా చూడాలని హితవు పలికారు. కార్యక్రమంలో పరిగి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, విద్యా మౌలిక వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాలుగు దశాబ్దాల ప్రజల కలను కేసీఆర్‌ నిజం చేసిండు

మోసపోతే గోస పడతామని ముందే చెప్పిండు

కాంగ్రెస్‌ పాలన చూస్తుంటే అది నిజమనిపిస్తోంది

దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి సబితారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement