కర్కశత్వం! | - | Sakshi
Sakshi News home page

కర్కశత్వం!

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

విచారణలో జాప్యంతో మరిన్ని కష్టాలు

కత్తులు దూస్తున్న..

ఆస్తుల కోసం

అనుబంధాల విస్మరణ

● తల్లిదండ్రులకు బిడ్డల మరణశాసనం

● కక్ష పెంచుకుని కడతేరుస్తున్న వైనం

● మొన్న కందుకూరు, నిన్న శంషాబాద్‌, తాజాగా ఫరూఖ్‌నగర్‌లో..

● కలవరపాటుకు గురిచేస్తున్న వరుస ఘటనలు

మద్యానికి బానిసై, జులాయిగా తిరుగుతూ దాడులు చేస్తున్న వారు కొందరైతే.. రూ.కోట్ల ఆస్తులను లాక్కొని ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్న కొడుకులు మరికొంత మంది లేకపోలేదు. పేగుతెంచుకు పుట్టిన బిడ్డల చేతిలో మోసపోయిన వారంతా న్యాయం కోసం కలెక్టర్‌, ఆర్‌డీఓలను ఆశ్రయిస్తున్నారు. మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌–2007 ప్రకారం వీరి నుంచి ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరుపుతున్నారు. నిజానికి బాధితులు ఫిర్యాదు చేసిన 90 రోజుల్లోనే తుది తీర్పు ఇవాల్సి ఉండగా, మెజార్టీ కేసుల్లో ఇలా జరగడం లేదు. జిల్లాలో 500పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ మెజార్టీ కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఫ్యూచర్‌సిటీ ప్రభావిత ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పరిధిలో వందకుపైగా ఫిర్యాదులు ఉండగా, వీటిలో ఇప్పటికే మెజార్టీ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. వృద్ధులపై దాడులు పెరుగుతుండటానికి విచారణ, తీర్పుల వెల్లడిలో తీవ్ర జాప్యం కూడా మరో కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల జిల్లాలో వెలుగు చూస్తున్న వరుస ఘటనలు వృద్ధ తల్లిదండ్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కందుకూరులో ఒకరు, శంషాబాద్‌లో మరొకరు, తాజాగా గురువారం ఫరూఖ్‌నగర్‌ మండలం దూసకల్‌లో ఇంకో వృద్ధుడు సొంతకొడుకు చేతిలో హతమవ్వడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

మచ్చుకు కొన్ని ఉదంతాలు

కందుకూరు మండలం పులిమామిడికి చెందిన గొర్రెల కాపరి పసుపుల జంగయ్య (65) పేరుపై 20 గుంటల భూమి ఉంది. దానిని విక్రయించేందుకు కొడుకు శేఖర్‌ ఆయనపై ఒత్తిడి తెచ్చాడు. నిరాకరించిన తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. గత ఏడాది జూన్‌లో రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న జంగయ్యను బండరాయితో మోది హత్య చేశాడు.

శంషాబాద్‌ మండలం చిన్నగోల్కొండకు చెందిన గౌతం అంజయ్య(78)కు ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్‌ మంజూరు చేసింది. నెలనెలా వచ్చే ఈ పెన్షన్‌పై మద్యానికి బానిసైన కొడుకు కన్నుపడింది. పింఛను డబ్బుల కోసం తండ్రితో ఘర్షణకు దిగాడు. తోపులాటలో తండ్రి అంజయ్య అప్పటికే మండుతున్న పొయ్యిలో పడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

శామీర్‌పేట్‌ పెద్దమ్మకాలనీకి చెందిన ఆలకుంట హన్మంతు (50) సతీమణి చేయి పొరపాటున ఆక్వేరియానికి తగిలి, పగిలిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కుమారుడు నరసింహ్మ కోపంతో తల్లిపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రిని హతమార్చాడు.

కొన్ని వివాదాలు

తనభర్త పేరున ఉన్న 2.20 ఎకరాల భూమిని ఆయన చనిపోయిన తర్వాత తమ పెద్ద కొడుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. తర్వాత తనకు తిండి కూడా పెట్టలేదు. ఇంట్లో నుంచి బయటికి గెంటేయడంతో న్యాయం చేయాల్సిందిగా కోరుతూ మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఇబ్రహీంపట్నం ఆర్‌డీఓ నోటీసులు జారీ చేసి ఇద్దరిని పిలిపించగా, అంతా చూస్తుండగా మళ్లీ ఆమెతో ఘర్షణకు దిగారు.

శంకర్‌పల్లి మండలం గాజులగూడకు చెందిన ఓ వృద్ధురాలు (82)కు పుట్టింటి నుంచి వారసత్వంగా 15 ఎకరాలు లభించింది. ఇందులో చెరో ఆరు ఎకరాల చొప్పున తన ఇద్దరు కుమారులకు రిజిస్ట్రేషన్‌ చేసింది. మిగిలిన రెండు ఎకరాలు విక్రయించగా వచ్చిన రూ.2.70 కోట్లను చిన్నకుమారుడి వద్ద దాచుకుంది. దాచుకున్న డబ్బును తనకు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరింది. ఇవ్వక పోవడంతో ఇటీవల కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఇద్దరు కుమారులపై కేసు నమోదైంది.

కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన అనసూయమ్మ (75) దంపతులకు 27 ఎకరాలు ఉంది. 2012లో భర్త మృతి చెందాడు. భర్త పేరున ఉన్న భూమి తర్వాత ఆయన భార్య పేరిట విరాసత్‌ కావాలి. తల్లికి తెలియకుండానే కొడుకులిద్దరూ ఆ భూమిని తమ పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత తల్లిని రోడ్డునపడేశారు. న్యాయం కోససం ఇటీవల ఆమె కలెక్టర్‌ సహా షాద్‌నగర్‌ పోలీసులను, ఆర్‌డీఓను ఆశ్రయించింది.

ఆస్తి విషయంలో కొత్తూరు మండలం ఇనుమల్‌నర్వకు చెందిన తల్లి యాదమ్మపై కొడుడు దాడి చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement