సాక్షి, రంగారెడ్డిజిల్లా: రీ సర్వే ప్రక్రియను జిల్లాలో అత్యంత పకడ్బందీగా చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం సహాయ సంచాలకులు, సర్వే, భూ రికార్డుల శాఖ పర్యవేక్షణలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో కచ్చితత్వం, పారదర్శకతతో నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు. ఆధునిక సర్వే పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. భూ సరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల సరిహద్దుల గుర్తింపు తదితర ప్రక్రియలను నిర్దేశిత విధానాల ప్రకారం పూర్తి చేయాలని చెప్పారు.
108 గ్రామాల్లో రీ సర్వే
కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆదేశాల మేరకు జిల్లాలో 41 నాన్–క్యాడాస్ట్రల్, 67 క్యాడాస్ట్రల్.. మొత్తం 108 గ్రామాలను రీ సర్వే కోసం గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 15 గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రారంభమయ్యాయని, ఆయా గ్రామాల్లో గ్రామ సరిహద్దులు, నివాస ప్రాంత సరిహద్దులు, ప్రభుత్వ ఆస్తుల సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని వివరించారు. రీసర్వే కోసం జిల్లాలో 15 పెంటాక్స్‌రోవర్స్ అందుబాటులో ఉండగా, 15 మంది మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 19 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు వెల్లడించారు. గ్రామస్తులకు రీసర్వే ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, వారి సహకారంతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
పెండింగ్ దరఖాస్తులపై దృష్టి పెట్టాలి
జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు, సాదాబైనామా, భూ భారతి తదితర అంశాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు, ప్రజా సమస్యలపై అదనపు కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. శాసనసభ్యుల ద్వారా వచ్చిన అభ్యర్థనలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రీసర్వే పనులతో పాటు పెండింగ్ రెవెన్యూ అంశాల పరిష్కారంలో ప్రతి అధికారి బాధ్యతతో, పరస్పర సమన్వయంతో పనిచేయాలని.. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని ఆయన సూచించారు.
వెట్టిచాకిరీ నిరోధానికి చర్యలు
ఇబ్రహీంపట్నం రూరల్: వెట్టి చాకిరీని పూర్తిగా నిరోధించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతోందని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి స్వేచ్ఛా రథం ప్రచార కార్యక్రమాన్ని గురువారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ బాధితులు, అసంఘటిత రంగ కార్మికులకు తమ హక్కులు, అందుబాటులో ఉన్న సహాయ మార్గలపై అవగాహన కల్పించడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్ 080 69434343పై విస్తృతంగా ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. వెట్టిచాకిరీకి సంబంధించి బాధితులను గుర్తించడం, వారిని రక్షంచడం, అవసరమైన సహాయం, పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయం, ఇటుక బట్టీలు, అక్వాకల్చర్, గనులు, క్వారీలు తదితర అసంఘటిత రంగాల్లో వెట్టిచాకిరీకి గురయ్యే అవకాశాలు ఉన్నందున స్వేచ్ఛారథం ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు, శ్రమ దోపిడీ ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


