మార్చి 31కి పూర్తి కావాలనే లక్ష్యంతో..
మొయినాబాద్: అష్ట కష్టాలు.. ‘మర్రి’ అడ్డంకులు దాటుకుంటూ సాగుతున్న హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రస్తుతం యుద్ధం అడ్డంకిగా మారింది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా తారు (బిటూమెన్) సరఫరాలో జాప్యం జరుగుతోంది. తద్వారా రహదారి విస్తరణ విస్తరణ పనుల్లో వేగం తగ్గి అనుకున్న సమయానికి పనులు పూర్తి కావడం కష్టంగా మారింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని అప్పా జంక్షన్‌్ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–163) విస్తరణకు కేంద్రం 2018లో నిధులు మంజూరు చేసింది. భూసేకరణ, రోడ్డుకు ఇరువైపులా ఉన్న మర్రిచెట్ల తొలగింపు వివాదంగా మారి విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏళ్ల నాటి మర్రిచెట్లు తొలగించొద్దంటూ పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. మర్రి చెట్లను మరోచోట ట్రాన్స్‌లొకేట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గత ఏడాది అక్టోబర్‌లో కోర్టు కేసు కోట్టేసింది. దీంతో మొదలైన పనులు కొంత కాలం వేగంగా జరిగినా ప్రస్తుతం తారు కష్టాలు మొదలయ్యాయి.
రూ.785 కోట్ల వ్యయంతో..
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46.4 కి.మీ. దూరం నాలుగు లేన్ల విస్తరణకు సుమారు రూ.785 కోట్ల వ్యయంతో పనులను చేపడుతున్నారు. మొయినాబాద్, చేవెళ్ల వద్ద రెండు బైపాస్‌లు, 12 అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. రహదారి విస్తరణ పనులను 2027 మార్చి 31 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. విస్తరణ పనుల్లో భాగంగా 150 మర్రిచెట్లు, ఇతర చెట్లను ట్రాన్స్ లొకేట్ చేసి మరోచోట పెట్టారు.
అష్ట వంకరలు
హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి ముందు నుంచీ అష్ట వంకరులుగానే ఉంది. మొయినాబాద్, చేవెళ్ల మండలాల మీదుగా వెళ్తున్న ఈ జాతీయ రహదారిలో సుమారు 20కి పైగా మలుపులు ఉన్నాయి. మొయినాబాద్ పరిధిలో జీవీకే, రాణే ఇంజన్ వాల్స్ కంపెనీ, గండిపేట చౌరస్తా, అజీజ్‌నగర్ పైప్‌లైన్ రోడ్డు వద్ద, హెచ్‌పీ పెట్రోల్ బంక్, జేబీఐటీ, తాజ్‌హోట్, కనకమామిడి అయ్యప్ప టెంపుల్, చిన్నషాపూర్ గేటు, గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్స్, అప్పారెడ్డిగూడ, తోలుకట్ట గేటు వద్ద మలుపులు అధికాంగా ఉన్నాయి. చేవెళ్లలోని ముడిమ్యాల గేటు, ముడిమ్యాల అటవీ ప్రాంతం, కందవాడ గేటు, మల్కాపూర్‌గేటు, కేసారం గేటు, ఇబ్రహీంపల్లి గేటు, దామరగిద్ద గేటు, ఖానాపూర్, మీర్జాగూడ, ఆలూరు, చిట్టెంపల్లి గేట్ల సమీపంలో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. గతంలో వంకర్లు ఉన్నట్లుగానే ప్రస్తుత రోడ్డు విస్తరణతో మలుపులు మరింత ఎక్కువవుతున్నాయి. వాటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఇంకా పూర్తికాని భూసేకరణ
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వం 2018లోనే భూసేకరణ మొదలు పెట్టినా కొన్నిచోట్ల ఇప్పటికీ పూర్తి కాలేదు. అప్పా జంక్షన్ నుంచి అజీజ్‌నగర్ చౌరస్తా వరకు సేకరణ చేపట్టలేదు. అజీజ్‌నగర్ చౌరస్తా నుంచి పనులు జరుగుతున్నా కొన్ని చోట్ల ఇంకా ఒకవైపు భూసేకరణ జరగలేదు. భాస్కర ఆస్పత్రి సమీపంలో కొంత దూరం ఒకవైపు మాత్రమే సేకరణ చేపట్టారు. బైపాస్‌లోనూ కొన్ని చోట్ల సేకరణ జరగక మధ్యలో పనులు నిలిచిపోయాయి.
తారు కష్టాలు
మొయినాబాద్ బైపాస్, చేవెళ్ల బైపాస్‌లో కొంత దూరం తారు రోడ్డు వేశారు. మధ్యమధ్యలో కల్వర్టులు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తికాకపోవడంతో బిట్లు బిట్లుగా కొంత మేర బీటీ వేసి.. ఎక్కువ చోట్లు కంకర పోసి వదిలేశారు. కొంత కాలంగా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నెలకొడనంతో అక్కడి నుంచి రావాల్సిన తారు(బిటూమెన్) సరఫరాలో జాప్యం జరుగుతోంది. దానికి తోడు ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. దీంతో చాలా చోట్ల కంకర వేసినా తారు వేయలేని పరిస్థితి నెలకొంది.
పలు చోట్ల నో అండర్‌పాస్
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 163 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 12 అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నా అసరమైన మరికొన్ని చోట్ల నిర్మాణం చేపట్టడం లేదు. మొయినాబాద్‌లోని కనకమామిడి గేటు, చిన్నషాపూర్ గేటు, అప్పారెడ్డిగూడ గేట్ల వద్ద అండర్‌పాస్ నిర్మాణం చేపట్టడంలేదు. చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు, ఖానాపూర్‌గేటు, ఆలూరు గేట్ల వద్ద కూడా నిర్మించడంలేదు. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తుంటే సర్వీస్ రోడ్డు వేసే అవకాశాలు కనిపించడంలేదు. రెండు వైపులా సర్వీస్ రోడ్డు లేకపోతే ఆయా గ్రామాల ప్రజలు ఏ విధంగా వెళ్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
నెమ్మదించిన హైదరాబాద్– బీజాపూర్ రహదారి విస్తరణ
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రభావం
తారు సరఫరాలో తీవ్ర జాప్యం
గడువులోగా పూర్తి కావడం కష్టమే..
వాహనదారులకు తప్పని పాట్లు
జాతీయ రహదారి విస్తరణ పనులు మార్చి 31 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఆధికారులను ఆదేశించారు. అంతకంటే మూడు నెలల ముందుగానే మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌లు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా పనుల్లో వేగం పెంచుతున్నా తారు రోడ్డు నిర్మాణంలో మాత్రం జాప్యం జరుగుతోంది. రెండు నెలల్లో మొయినాబాద్–చేవెళ్లలో 10 కి.మీ. రహదారి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. కానీ మార్చి 31లోగా పనులు పూర్తయి అందుబాటులోకి రావడం కష్టమే అనిపిస్తోంది.


