ఇంటి నంబర్ల దందా! | - | Sakshi
Sakshi News home page

ఇంటి నంబర్ల దందా!

Oct 5 2026 8:30 AM | Updated on Oct 5 2026 8:30 AM

ఈ చిత్రంలో కనిపిస్తున్న భవన నిర్మాణం మొయినాబాద్‌ మున్సిపాలిటీ హిమాయత్‌నగర్‌ రెవెన్యూలోని పద్మావతి–2 కాలనీలో జరుగుతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి సుమారు 350 గజాలకు పైగా ప్లాటు కొనుగోలు చేసి నాలుగు నెలల క్రితం నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు జీ ప్లస్‌ 4 అంతస్తుల స్లాబ్‌లు వేశారు. పైన మరో స్లాబ్‌ వేసేందుకు పిల్లర్లు వేస్తున్నారు. కింది నుంచి గోడల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారులు జూలైలోనే ఇంటి నంబర్‌ జారీ చేశారు. రూ.17,168 ప్రాపర్టీ ట్యాక్స్‌ కూడా కట్టించుకున్నారు.

మొయినాబాద్‌: మున్సిపాలిటీలో ఇంటి నంబర్ల దందా జోరుగా సాగుతోంది. నిర్మాణాలు పూర్తికాకుండానే అధికారులు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. 111 జీవో పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేకున్నా.. అధికారులు మాత్రం దర్జాగా తమ చేతివాటం ప్రదర్శిస్తూ నంబర్లు ఇచ్చి రూ.లక్షలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సెటిల్‌మెంట్లకోసం ప్రత్యేక కార్యాలయం

మున్సిపల్‌ కమిషనర్‌ సెటిల్‌ మెంట్లు, ఇంటి నంబర్ల విషయాలు మాట్లాడుకోవడానికి ప్రత్యేక కార్యాలయం నడుపుతున్నట్టు సమాచారం. అజీజ్‌నగర్‌ చౌరస్తాలోని పద్మావతి కాలనీలో ఓ పోర్షన్‌ అద్దెకు తీసుకుని ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజనం అనంతరం విశ్రాంతి కోసం అంటూ అద్దెకు తీసుకున్న పోర్షన్‌లో సెటిల్‌మెంట్లు కొనసాగిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నావారు, ఇంటి నంబర్లు కావాల్సిన వారు ప్రత్యేక కార్యాలయంలో ఆయన్ను కలిసి మాట్లాడాల్సిందే. మధ్యాహ్నం, రాత్రి సమయంలో కమిషనర్‌ ఎక్కువ సమయం ప్రత్యేక కార్యాలయంలోనే ఉంటున్నారు. కమిషనర్‌ నడుపుతున్న ప్రత్యేక కార్యాలయంపై నిఘా విభాగం సైతం కన్నేసింది. ఇటీవలే నిఘా అధికారులు ప్రత్యేక కార్యాలయాన్ని పరిశీలించి ధ్రువీకరించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపాలిటీ ఏర్పడకముందు హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్లు ఇచ్చారు. అప్పటి పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుత మున్సిపల్‌ అధికారి ఒకరు అప్పట్లో డబ్బులు తీసుకుని సుమారు వందకు పైగా ఇంటి నంబర్లు జారీ చేశారు. ఇంటి నంబర్లు కేటాయించినా అవి ఇప్పటికీ ఖాళీ ప్లాట్లుగానే ఉండడం విశేషం.

ప్రజాప్రతినిధులదీ అదే తీరు

మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, ఇంటి నంబర్ల కేటాయింపులో ప్రజాప్రతినిధుల పాత్ర సైతం కీలకంగా ఉంది. నిర్మాణాలు చేపడుతున్నవారి నుంచి చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లు ముడుపులు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది ప్రజాప్రతినిధులు బలవంతంగా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.లక్షల్లో దండుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపాలిటీ ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ఏకంగా 1,100కు పైగా ఇంటి నంబర్లు కేటాయించారు. ఇందులో ప్రజాప్రతినిధులతోపాటు అధికారుల పాత్ర కీలకంగా ఉందనే ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి.

గండిపేట రోడ్డు పక్కన హిమాయత్‌నగర్‌ రెవెన్యూలో నగరానికి చెందిన ఓ వ్యాపారి విల్లా నిర్మాణం చేపట్టారు. భవనం నిర్మాణంలో ఉండగానే మున్సిపల్‌ అధికారులు మూడు నెలల క్రితమే అసెస్మెంట్‌ చేసి ఇంటి నంబర్‌ కేటాయించారు. అప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాలేదు. ఇంటి నంబర్‌ ఇచ్చిన తరువాత నిర్మాణదారుడు భవన నిర్మాణాన్ని పూర్తి చేసి పెయింట్‌ వేశారు.

సురంగల్‌ రెవెన్యూలో నగరానికి చెందిన ఇద్దరు స్నేహితులు కలిసి కొంత కాలం క్రితం 120 గజాల ప్లాటు కొనుగోలు చేశారు. ప్లాటును చెరో 60 గజాల చొప్పున పంచుకున్నారు. ఇటీవల 60 గజాల్లో ఒకరు ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఓ కౌన్సిలర్‌ అక్కడికి వెళ్లి రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందర్ని నేనే చూసుకుంటా.. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఇంటి నంబర్‌ కూడా ఇప్పిస్తానన్నారు. లేదంటే నిర్మాణాన్ని కూల్చివేయిస్తానని బెదిరించారు. సదరు వ్యక్తి అంత ఇచ్చుకోలేనని బతిమాలి కొంత మొత్తం ముట్టజెప్పారు.

నిర్మాణాలు పూర్తికాకముందే కేటాయింపు

యజమానుల నుంచి రూ.లక్షల్లో వసూలు

ఇటు మున్సిపల్‌ అధికారులు, అటు ప్రజాప్రతినిధులు..

ఎవరికి వారు ‘క్యాష్‌’ చేసుకుంటున్న వైనం

మొయినాబాద్‌ పురపాలికలో ఆరోపణల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement