● బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి
● నిజనిర్ధారణ కమిటీ సభ్యులు
మంచాల: మంత్రాల నేపంతో దాడిచేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య అన్నారు. ఇటీవల మండలంలోని నోములలో మంత్రాల నేపంతో పల్లాటి వెంకటమ్మపై జరిగిన దాడి విషయం తెలుసుకొని మానవ హక్కుల వేదిక, భారత నాస్తిక సమాజం, విజ్ఞాన దర్శిని సంఘాలు సంయుక్తంగా నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి ఆదివారం గ్రామంలో పర్యటించాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో సెప్టెంబర్ 23న జరిగిన సంఘటనపై బాధితులతో పాటు నిందితుల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించినట్టు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు. మంత్రాల నెపంతో వృద్ధ మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా దాడిచేశారన్నారు. వెంకటమ్మ భర్త, ఆమె కొడుకుపై సైతం దాడికి పాల్పడ్డారన్నారు. సమాజంలో మూఢత్వం, మూర్ఖత్వానికి ఇదీ ప్రతీక నిలిచిందన్నారు. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురిని మాత్రమే రిమాండ్‌కు పంపించారని, మిగగా వారందరినీ అరెస్టు చేయాలన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా బాధ్యులు ఎ.నర్సింహ, సపావట్ రాజు, సభ్యులు దిలీప్, సంజీవ్, వెంకటనారాయణ, అచ్యుత్‌కుమార్, కిరణ్, భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు జీడీ సారయ్య, జీడీ స్పార్టకస్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, సభ్యులు నవీన్, ప్రశాంత్, జ్ఞానేశ్వర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


