తవ్వకాలు నిలిపేస్తాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మట్టి మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం మండలాల్లో గుట్టలు మాయం చేస్తుండగా, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, తదితర ప్రాంతాల్లో ఏకంగా చెరువులనే తవ్వేస్తున్నారు. ఇటుక బట్టీల పేరుతో చెరువుల్లోని మట్టిని తోడేస్తున్నారు. ప్రభు త్వం నుంచి తీసుకున్న అనుమతులకు భిన్నంగా గుట్టలు, చెరువులు, కుంటలను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకుంటున్న స్థానిక రైతులపై దాడులకు తెగబడుతున్నారు.
ఆనవాళ్లు ధ్వంసం
తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట్ రెవెన్యూ సర్వే నంబర్ 214లోని 16 ఎకరాల విస్తీర్ణంలోని చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులకు భిన్నంగా తవ్వకాలు చేపడుతున్నారు. దరఖాస్తుదారు ప్రభుత్వానికి రూ.1.60 లక్షలు మాత్రమై రాయాల్టీ చెల్లించి, రూ.కోటిన్నర విలువైన మట్టిని కొల్లగొట్టినట్లు తెలిసింది. అడ్డు తగిలిన రైతులకు బెదిరింపులు తప్పడం లేదు. 20 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్న తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా.. ఇటు ఇరిగేషన్, అటు రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
అనుమతులకు భిన్నంగా..
చెరువుల పూడిక తీతలో భాగంగా మూడు ఫీట్ల లోతు మాత్రమే మట్టిని తవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ పది నుంచి 12 ఫీట్లు తవ్వి.. ఇప్పటికే 3000 పైగా టిప్పర్ల మట్టిని లేమూరు, సరస్వతిగూడ, తిమ్మాపూర్, కొంగర, మంఖాల్, మహేశ్వరం పరిసర ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. సమీప రైతులు తమ పొలాల్లోకి మట్టిని తరలించేందుకు యత్నిస్తే.. అడ్డుకునే పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్ అధికారులు కళ్ల ముందే ఇంత విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేటలో తంతు
రాత్రి, పగలు తేడా లేకుండా భారీగా తవ్వకాలు
ఇప్పటికే మూడు వేలకుపైగా లారీల మట్టి తరలింపు
అడ్డుకున్న రైతులకు బెదిరింపులు
పంచాయతీ తీర్మానం మేరకు మైనింగ్ విభాగం మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. కాంట్రాక్టర్ రాయల్టీ ఫీజు కూడా చెల్లించారు. మూడు ఫీట్ల లోతుకు మించి తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధన ఉంది. తీసుకున్న అనుమతుల విస్తీర్ణానికి మించి తవ్వకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందాయి. గడువు కూడా ముగిసింది. వెంటనే తవ్వకాలు నిలిపివేస్తాం.
– సమ్మయ్య, డీఈ, ఇరిగేషన్, కల్వకుర్తి


