బతుకులు బోల్తా | - | Sakshi
Sakshi News home page

బతుకులు బోల్తా

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

అశ్రునయనాలతో అంత్యక్రియలు

ధారూరు మండలం కేరెళ్లి సమీప అనంతగిరి గుట్ట చివరి మలుపు ప్రమాదాలకు పిలుపుగా మారింది. వికారాబాద్‌– తాండూరు మార్గంలో ఉన్న అనంతగిరి కొండల్లోంచి వాహనాలు నడపాలంటే తగిన నైపుణ్యం ఉండాలి. ఇది కొత్త డ్రైవర్లకు సవాలుగా మారుతోంది. అనుభవం లేకపోవడంతోనే డ్రైవర్‌ మలుపులో బస్సును అదుపు చేయలేక సడెన్‌ బ్రేక్‌ వేయడం, కుదుపుతో బస్సు పల్టీ కొట్టడం జరిగిపోయాయి.

గతంలోనూ బస్సు ప్రమాదం

ప్రైవేటు బస్సు ప్రమాద స్థలంలోనే గతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై ఓ మహిళ మృతి చెందింది. అక్కడే బైక్‌లు, కార్లు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హరిదాస్‌పల్లిలో ఇలాగే..

గతంలో ధారూరు మండలం హరిదాస్‌పల్లి గ్రామానికి చెందిన రుకుంపల్లి రామయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహానికి పోస్టుమార్టం చేయించుకుని తిరిగి వస్తున్న సమయంలో వికారాబాద్‌ సమీప బండబావి సమీపంలో కుటుంబీకులు, బంధువుల ట్రాక్టర్‌ బోల్తాపడి రుకుంపల్లి చంద్రయ్య, గోపాల్‌, శివ్వమ్మతో పాటు ఓ పాప దుర్మరణం పాలయ్యారు.

ఎబ్బనూర్‌లోనూ ఇదే మాదిరిగా..

గతంలో మండలంలోని ఎబ్బనూర్‌ గ్రామానికి చెందిన చాకలి బీమయ్య(28) బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా రాంచంద్రాపురంలో కూలి పనులు చేసుకుంటున్న అన్నదమ్ములు చాకలి గోపాల్‌, జగన్‌ తమ కుటుంబాలతో సొంత ఆటోలో అంత్యక్రియలకు బయలుదేరారు. ఎబ్బనూర్‌ చెరువు వద్ద వీరి ఆటోను లారీ ఢీకొట్టింది. గోపాల్‌, జగన్‌ భార్యలు కమలమ్మ, శారద, జగన్‌ కూతురు అర్చన దుర్మరణం పాలయ్యారు. గోపాల్‌, అతని కూతురు సంతోష, జగన్‌ కూతురు అక్షయకు తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా సంఘటనతో మండల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఒకే కుటుంబంలో ఇలా..

అత్తెల్లి అనంత్‌రెడ్డి తన ఇద్దరు భార్యలతో కలిసి అంత్యక్రియలకు బయలుదేరారు. ప్రమాదంలో ఇద్దరు భార్యలు యాదమ్మ, పద్మమ్మ మృతి చెందారు. అనంత్‌రెడ్డికి చేయి విరిగి, తలకు గాయాలై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ప్రైవేటు బస్సు పల్టీ

నలుగురిని బలితీసుకున్న ప్రమాదం

తెగిపడిన చేతులు, కాళ్లు

రక్తమోడుతూ హాహాకారాలు

జైదుపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద భీతావహ దృశ్యాలు

తలలు పగిలినవారు కొందరు.. చేతులు, కాళ్లు విరిగినవారు మరికొందరు.. తీవ్ర గాయాలతో రక్తమోడుతూ ఇంకొందరు.. ఒకవైపు క్షతగాత్రుల అరుపులు.. ఆర్తనాదాలు.. మరోవైపు కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు.. ఇవీ.. ధారూరు మండలం కేరెళ్లి– అనంతగిరి చివరిగుట్ట మధ్యన జైదుపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద శనివారం కనిపించిన భీతావహ సన్నివేశాలు. ఇక్కడ జరిగిన బస్సు ప్రమాద ఘటన నలుగురిని బలితీసుకోగా మరో 40 మందిని ఆస్పత్రుల పాల్జేసింది. – ధారూరు

శంకర్‌పల్లి: ధారూరు పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన రాజండ్ల ప్రమీళ (52) అంత్యక్రియలు శనివారం బంధువుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మృతదేహానికి వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని సింగాపురానికి తరలించి, సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ప్రమీళ మృతితో సింగాపూరం వాసులు కన్నీటిపర్యంతం అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement