బాధ్యత పెరిగింది
● మరో మూడు పీఎస్‌ల నుంచి పలు గ్రామాల విలీనం
● ప్రస్తుతం బీ కేటగిరీలో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్
● ఏ జాబితాలో చేరిస్తే అదనపు వసతులు సమకూరే అవకాశం
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. పోలీస్ జోన్లు, డివిజన్లు, లా అండ్ అర్డర్ పీఎస్‌లతో పాటు ఇతర విభాగాల పరిధులను నిర్ధారిస్తూ జీవో 84ను జారీ చేసింది. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆదిభట్ల పీఎస్‌కు అత్యంత ప్రాధాన్యత దక్కింది.
పలు గ్రామాల విలీనం
ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ప్రస్తుతం బీ కేటగిరీలో ఉంది. ఆదిభట్ల, కొంగరకలాన్, ఎంపీపటేల్‌గూడ, బొంగ్లూర్, రావిర్యాల, నాదర్‌గుల్, తుర్కయంజాల్, మన్నెగూడ, రాగన్నగూడ, కుర్మల్‌గూడ ప్రాంతాలకు విస్తరించి ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవోతో మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పీఎస్‌కు చెందిన తొర్రూర్, కోహెడ, బ్రాహ్మణపల్లి, మునగనూరు గ్రామాలను ఆదిభట్ల పీఎస్‌లో చేర్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కొహెడ, ఉమర్‌ఖాన్‌గూడను సైతం ఇందులో కలిపారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో ఉన్న మంగళ్‌పల్లి, రాందాస్‌పల్లి, చింతపల్లిగూడ, సాహెబ్‌గూడ, ఫెరోజ్‌గూడ గ్రామాలను ఆదిభట్ల పీఎస్‌లో విలీనం చేశారు. దీంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అతిపెద్ద పీఎస్‌గా ఆదిభట్ల ఆవిర్భవించింది.
పెరగనున్న క్రైం రైట్
ప్రస్తుతం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటా నేరాలకు సంబంధించి 800 కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కలిపిన గ్రామాలతో ఈ తరహా కేసులు 1300 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదు. అదనంగా గ్రామాలు వచ్చి చేరడంతో అవస్థలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ జీవోతో పాలన మొదలైంది. తొలి రోజు తోర్రూర్ గ్రామం నుంచి వ్యక్తి ఆత్మహత్య కేసు నమోదైంది.
ఏ కేటగిరీలోకి మారిస్తేనే..
ప్రస్తుతం పోలిస్‌స్టేషన్ బీ కేటగిరీలో ఉండటంతో సీఐ, నలుగురు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలతో పాటు 70 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో జౌటర్ రింగ్ రోడ్డు, టీసీఎస్, ఏరోస్పేస్, టాటా సంస్థలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో రియల్ ఎస్టేట్ సంస్థలు, కొహెడ పండ్ల మార్కెట్ ఇక్కడ ఉంది. వీటన్నింటికీ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏ కేటగిరీలో చేరిస్తే ఒక డీఐ, మరో ఎస్‌ఐతో పాటు పెట్రో మొబైల్ వాహనాలు సమకూరుతాయి.
ఆదిభట్ల అతిపెద్ద పోలీస్ స్టేషన్‌గా అవతరించింది. ప్రభుత్వం నిర్ణయంతో మరో మూడు పీఎస్‌ల నుంచి పలు గ్రామాలను ఇందులో విలీనమయ్యాయి. ఇక క్రైంతో పాటు పని భారం పెరుగుతుంది. నిఘా వ్యవస్థను పెంచాల్సి ఉంటుంది. నిధులు, సిబ్బంది కావాలని ఉన్నతాధికారులను కోరాం. ప్రజల సహకారంతో శాంతి భద్రతలను కాపాడుతాం.
– రమేష్, సీఐ ఆదిభట్ల


