యాచారం: మొండిగౌరెల్లి అసైన్డ్ భూములకు పరిహారం అందజేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. విడతల వారీగా అవార్డు జారీ చేసి అర్హులైన వారికి చెక్కులు పంపిణీ చేసేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. గ్రామంలోని సర్వే నంబరు 19, 68, 127లో మొత్తం 498 మంది రైతులకు సంబంధించిన 677 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని పారిశ్రామిక పార్క్‌ల కోసం సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రైతుల కబ్జాపై సర్వే చేపట్టారు. అత్యధికంగా అసైన్డ్, ప్రభుత్వ భూమి కావడంతో రైతులు కూడా పెద్దగా వ్యతిరేకించలేకపోయారు. పరిహారం త్వరగా అందజేస్తే ఇతర ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేస్తారని భావించిన పంచాయతీ పాలకవర్గం అధికారుల సర్వేకు పూర్తిగా సహకరించింది. కానీ నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది పూర్తి కావడం, సర్వే చేసి నెలలు దాటినా పరిహారం చేతికందకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
ఒకేసారి ఇవ్వాలని రైతుల డిమాండ్
మొదట మొండిగౌరెల్లి సర్వేనంబర్ 127లోని అసైన్డ్ రైతులకు పరిహారం చెక్కులు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజో, రేపో జాబితాతో కూడిన అవార్డును జారీ చేయనున్నారు. గ్రామంలో 19, 68, 127 సర్వేనంబర్లు ఉన్నప్పటికీ మొదటి విడతగా 127లోని అర్హులైన రైతులకు పరిహారం ఇచ్చేందుకు అవార్డు పాస్ చేయనున్నారు. ఆతర్వాత మిగిలిన నంబర్లకు అవార్డు జారీ చేయనున్నారని తెలుస్తోంది. అసైన్డ్ సర్వేనంబర్లల్లో భారీ అక్రమాలు జరిగాయని, నకిలీల పేర్ల మీద పరిహారం వచ్చే అవకాశం ఉందని రైతులు అరోపిస్తున్నారు. పూర్తిగా రీ సర్వే చేసి, ఫైనల్ లిస్ట్‌ను ప్రకటించిన తర్వాతే మూడు సర్వేనంబర్లను కలిపి ఒకేసారి అవార్డు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సమయం ఇవ్వని కలెక్టర్
భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో మొండిగౌరెల్లి రైతులతో సమావేశమైన కలెక్టర్ నారాయణరెడ్డి ప్రస్తుతం రైతులను కలిసేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. మొదట్లో అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.30 లక్షలు, ఎకరాకు 121 గజాల ప్లాటు, రైతు కుటుంబానికి అదనంగా మరో 121 గజాల ప్లాటు, కబ్జా రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడానికి స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో అంగీకరించారు. కానీ కబ్జా రైతులకు పరిహారం ఇచ్చేది లేదని, ప్రభుత్వ భూముల్లో ఇన్నాళ్లు సాగు చేసుకుని బతికారు కదా.. అనే కోణంలో అధికారులు మాట్లాడటం కబ్జా రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. కబ్జా భూములకు ఇచ్చే పరిహారంపై స్పష్టత ఇస్తేనే సరి.. లేదంటే మరో భూ పోరాటానికి సిద్ధమని రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం కబ్జా రైతులకు పరిహారం ఇచ్చే విషయాన్ని తేల్చకుండా అవార్డు పాస్ చేసి అసైన్డ్, పట్టా రైతులకు పరిహారం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
మొండిగౌరెల్లి అసైన్డ్ భూములకు త్వరలోనే పరిహారం
మూడు విడతల్లో అందజేతకు అధికారుల నిర్ణయం
కబ్జా భూములకు ఇచ్చే పరిహారంపై స్పష్టత కరువు
నేడో, రేపో ప్రకటన జారీ


