విస్తరించేనా! | - | Sakshi
Sakshi News home page

విస్తరించేనా!

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

భవిష్యత్తు దృష్ట్యా..

నేషనల్‌ హైవే పరిధిలోకి వెళ్తేనే..

యాచారం: నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిని నేషనల్‌ హైవే పరిధిలోకి తీసుకునేలా రాష్ట్ర సర్కార్‌ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. హైదరాబాద్‌ నుంచి నాగార్జునసాగర్‌ రహదారి 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సాగర్‌లోని బుద్ధవనాన్ని దర్శించుకోవడం కోసం దేశ, విదేశాల నుంచి ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. మహానగర విస్తరణ, ఫ్యూచర్‌సిటీ నిర్మాణంతో నాలుగైదు ఏళ్లుగా ఈ రోడ్డు వేలాది వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా మారింది. భవిష్యత్తులో మరింత రద్దీగా మారడంతోపాటు ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదని సర్కార్‌ గుర్తించింది. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ పరిధిలో ఉన్న ఈ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా విస్తరించడానికి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలోనే ప్రతిపాదించి డీపీఆర్‌ తయారు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ కూడా భవిష్యత్తు దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా విస్తరించడానికి నిర్ణయించింది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాదారుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం హెచ్‌ఎండీఏ, పోలీస్‌, రవాణా శాఖ సంయుక్తంగా ఓ ప్రైవేట్‌ కంపెనీ ప్రతినిధులతో సర్వే సైతం చేయించారు. సింహభాగం ప్రయాణికులు రోడ్డు విస్తరణ చేపట్టాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

రోడ్డు విస్తరణ మేం చేయలేం

అయితే రోడ్డు విస్తరణ తాము చేపట్టలేమంటూ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ సర్కార్‌కు తేల్చిచెప్పినట్టు తెలిసింది. నగరం నుంచి నాగార్జునసాగర్‌ సమీపం అక్కంపల్లి (పుట్టంగండి) వరకు 120 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల కృష్ణాజలాల పైపులైన్లు ఉన్నాయి. పలుచోట్ల రోడ్డు పక్కనే ఎయిర్‌వాల్వ్‌లు ఉన్నాయి. విస్తరణ చేపడితే ఎయిర్‌వాల్వ్‌లు తొలగించడం, మార్చడం భారీ ఖర్చుతో కూడుకున్న పనవుతుందని విస్తరణకు రోడ్డు భవనాల శాఖ విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారికి మోక్షం కలిగేనా..

సాధ్యం కాదని తేల్చిచెప్పిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ

నేషనల్‌ హైవే పరిధిలోకి తీసుకునేలా కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదన?

ఎన్‌హెచ్‌ పరిధిలోకి వెళ్తే విస్తరణ చేపట్టొచ్చని సర్కార్‌ ఆలోచన

రోడ్డుకు ఇరువైపులా భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడం తథ్యం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విస్తరిస్తే బాగుంటుందనే ఆలోచనతో సర్కార్‌కు తెలియజేశాను. నాగార్జునసాగర్‌, కల్వకుర్తి, దేవరకొండ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రోడ్డును విస్తరించేలా విన్నవిస్తాం.

– మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం

రహదారి నేషనల్‌ హైవే పరిధిలోకి వెళ్తేనే త్వరగా విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రోడ్డు సమీపంలోనే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీ నిర్మాణం అవుతుండడం, రోడ్డుపై ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు పలు ఇంజనీరింగ్‌ కశాశాలు ఏర్పాటు కావడం, ఫ్యూచర్‌సిటీ నిర్మాణంలో భాగంగా ప్రపంచ స్థాయి గుర్తింపు నిచ్చే భారీ ప్రాజెక్టులు నెలకొల్పడానికి ఆసక్తి చూపుతుండడంతో రోడ్డు విస్తరణ ఆవశ్యకమని భావిస్తోంది. ఈ రోడ్డు నుంచి ఏపీలోని మాచర్ల, గుంటూరు, కణిగిరి, మార్కాపురం, వినుకొండ, చీరాల తదితర ప్రాంతాలకు ఆ ప్రాంతవాసులు రాకపోకలు సాగిస్తారు. ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు, పలు వ్యాపార సంస్థల ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో రోడ్డు విస్తరణకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పెద్దలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement