సేవా అభియాన్‌ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సేవా అభియాన్‌ ఏర్పాట్ల పరిశీలన

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

సేవా అభియాన్‌ ఏర్పాట్ల పరిశీలన మరకత శివాలయం సందర్శన టెన్త్‌ టాపర్లకు విమానయానం బాలాపూర్‌ గణనాథుడి సన్నిధిలో ప్రముఖులు

కందుకూరు: ప్రధాని మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 17న మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో చేపట్టనున్న సేవా అభియాన్‌ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం అదనపు కలెక్టర్‌ కిరణ్మయి పర్యవేక్షించారు. ఆ రోజు కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, గంగాపురం కిషన్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీపీఓ సురేష్‌మోహన్‌, తహసీల్దార్‌ గోపాల్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములుయాదవ్‌, జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్మటి దేవేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, భిక్షపతి, సాధ మల్లారెడ్డి, శేఖర్‌గౌడ్‌, అంబోజి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్పలో వెలసిన మరకత శివాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణారెడ్డి మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్‌, ఆలయ కమిటీ సభ్యులు వారికి శేషవస్త్రం కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఆకుపచ్చ ఆకారంలోని శివలింగాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరోవైపు సోమవారం తెలంగాణ సాంస్కృతి సారథి కార్పొరేషన్‌ చైర్మన్‌ వెన్నెల గద్దర్‌ శివలింగాన్ని దర్శించుకున్నారు. స్వామివారి దయ రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

యాచారం: ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులను విమానంలో తిరుపతికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం కల్పించారు ఓ ఉపాధ్యాయుడు. మండలంలోని నల్లవెల్లి ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు నరేందర్‌రెడ్డి 2025– 26 పదో తరగతి పరీక్షలో 550 పైగా మార్కులు సాధించిన వారిని విమానంలో తిరుపతి తీసుకెళ్తానని విద్యార్థులకు మాటిచ్చారు. 552 మార్కులు సాధించిన మహేశ్‌, 551 సాధించిన పవన్‌ను శనివారం సొంత డబ్బులతో హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతికి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనం కల్పించి, క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. ఈసారి అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి ఊహించని బహుమతి అందజేస్తానని నరేందర్‌రెడ్డి తెలిపారు. తొలిసారి విమానం ఎక్కిన అనుభూతిని, తమను ప్రోత్సహించిన ఉపాధ్యాయుడిని జీవితంలో మర్చిపోలేమని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

బడంగ్‌పేట్‌: బాలాపూర్‌ గణనాథుడిని సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి దర్శించుకుని మొదటి పూజ నిర్వహించారు. మంగళవారం సీపీ సజ్జనార్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్‌, మాజీ మేయర్‌ చిగురింత పారిజాత తదితరులు దర్శించుకున్నారు. వారికి ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి శాలువాలు కప్పి సన్మానించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement