పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడకు చెందిన రత్యా కుమార్తె శిరీష(21) స్థానిక హెచ్‌పీ పెట్రోల్ పంప్‌లో పనిచేస్తోంది. ఈనెల 13న విధులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న శిరీష ఎవరికీ చెప్పకుండా బయ టకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంతవెతికినా ఆచూకీ లభించలేదు. సబావత్ అనిల్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ యువతి తల్లి దేపావత్ శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గౌతాపూర్ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు
తాండూరు రూరల్: తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఈడ్గి విజయంకిత ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. నీట్ ప్రవేశ పరీక్షల్లో 443 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3,730, ఆలిండియాలో 1,79,561 ర్యాంక్ సాధించింది. రెండో కౌన్సెలింగ్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు దక్కించుకుంది. విజయంకిత తండ్రి మూడేళ్ల క్రితమే మృతిచెందగా, తల్లి రాధిక తన ఇద్దరు పిల్లలను చదివిస్తోంది.
కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
కుల్కచర్ల: ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కొనగల్ల వెంకటయ్య నంచర్ల నుంచి స్వగ్రామం తిర్మలాపూర్ వస్తుండగా, కారులో పరిగి నుంచి మహబూబ్‌నగర్ వైళ్తున్న ముడవత్ హతిరాం బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వెంకటయ్యకు తీవ్రగాయాలయ్యాయి. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రెండు వాహనాలను పీఎస్‌కు తరలించారు.
యాలాల: ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని నాగసముందర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొక్కెన ఆశప్ప(45) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రంగానే ఉండటంతో మనస్థాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆశప్ప భార్య బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి వైరుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నవాబుపేట: ఉన్న ఒక్క టీచర్ వస్తేనే చదువు.. లేకపోతే సెలవు. ఇదీ నాగిరెడ్డిపల్లి పాఠశాల పరిస్థితి. ఉపాధ్యాయులు సెలవు పెడితే కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సర్పంచ్ శేఖర్, పలువురు స్థానికులు ఎంఈఓ అబ్దుల్ రహమాన్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు. మంగళవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు బడి తలుపులు తెరవకపోవడంతో రెండు గంటల పాటు టీచర్ కోసం ఎదురు చూశారు. ఆతర్వాత చేసేదేమీ లేక ఇళ్లకు వెళ్లిపోయారు. ఈవిషయమై ఎంఈఓను వివరణ కోరగా పాఠశాలలో ఒకే టీచర్ పనిచేస్తున్నారని, అనారోగ్య సమస్య కారణంగా సెలవు పెట్టారని తెలిపారు. తాను కూడా సెలవులో ఉండటంతో మరో టీచర్‌ను నియమించడంలో జాప్యం జరిగిందని, మరోసారి కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.


