ఆమనగల్లు: సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. మాడ్గుల మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర పంచాయితీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ సూదిని రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత హాజరయ్యారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. అన్ని గ్రామాలకు, తండాలకు బీటీరోడ్లు నిర్మిస్తామని, గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి నర్సిరెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ వినయ్‌సాగర్, పంచాయితీరాజ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రైతులకు స్ప్రింక్లర్ల పంపిణీ
మాడ్గుల ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో మంజూరైన 126 స్ప్రింక్లర్లను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సురేశ్, ఐడీహెచ్ అరుణ, ఉద్యానశాఖ అధికారి నవీన, హెచ్‌ఈఓలు సీతారాం, నగేశ్, స్థానిక నాయకులు సూదిని కొండల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్యగౌడ్, సర్పంచ్ రజిత, ఉపసర్పంచ్ శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


