లక్డీకాపూల్: ఒక నిరుపేద యువకుడి కుటుంబం తీసుకున్న సాహసోపేత నిర్ణయం ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన రంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడి మరణంలో కూడా ముగ్గురికి పునర్జన్మనిచ్చాడు. జీవన్‌దాన్ ప్రోగ్రామ్ ఇంచార్జ్ ప్రొఫెసర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం, లోయపల్లికి చెందిన సిలువేరు అనిల్ (30) రోజువారీ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 6న అనిల్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మర్రిగూడ సమీపంలో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడిని కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ అనిల్ కోలుకోలేకపోయాడు. చివరకు మంగళవారం వైద్యులు అతడిని ’బ్రెయిన్ డెడ్’ (మస్తిష్క మరణం)గా ప్రకటించారు. తీవ్ర దుఃఖంలో ఉన్నప్పటికీ, అనిల్ తండ్రి సిలువేరు మల్లేష్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి అవయవాలను దానం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. అనిల్ పార్థివ దేహం నుండి కాలేయం, నేత్రాలు సేకరించారు. ఈ అవయవాల ద్వారా ముగ్గురు రోగులకు పునర్జన్మ లభించనుందని శ్రీభూషణ్ రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనిల్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నిర్ణయం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణలో 147 బ్రెయిన్ డెడ్ అవయవ దానాలు జరగగా, అనిల్ దానంతో ఈ సంఖ్య 148వ మైలురాయికి చేరుకుందని శ్రీ భూషణ్ రాజు తెలిపారు.


