పూడూరు: అధిక శబ్దంతో డీజే పెట్టి, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు సృష్టించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు చన్గోముల్ ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు. పూడూరు గ్రామంలో సోమవారం విధులు నిర్వర్తిస్తున్న బ్లూ కోట్స్ సిబ్బందికి పెద్ద శబ్దంతో డీజే సౌండ్ వినిపించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డీజే ఏర్పాటు చేసిన వాహనంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని గుర్తించారు. వాహనాన్ని సీజ్ చేసి పీఎస్‌కు తరలించారు. హిమాయత్‌నగర్‌కు చెందిన పి.ఉదయ్ డీజే నిర్వాహకుడిగా తమ విచారణలో తేలిందన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
14 మందికి బైండోవర్
తాండూరు రూరల్: వినాయక శోభాయాత్ర సందర్భంగా డీజే పెడితే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్ హెచ్చరించారు. మంగళవారం పెద్దేముల్ మండల కేంద్రంలో 14 మంది డీజే ఆపరేటర్లను తహసీల్దార్ వెంకట్ ప్రసాద్ ఎదుట బైండోవర్ చేశారు.


