తుది దశకు చేరిన కొత్తపేట టిమ్స్ నిర్మాణ పనులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న మహేశ్వరం మెడికల్ కాలేజీని కర్మన్‌ఘాట్‌లోని మరో అద్దె భవనంలోకి మార్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత అద్దె భవనంలో ఆశించిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అనుబంధ ఆస్పత్రికి 18 కిలోమీటర్ల దూరం ఉండడం, వైద్య విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడానికి తోడు శనివారంతో ఒప్పంద గడువు కూడా ముగిసింది. ఇటీవల ఇదే అంశంపై సాక్షిలో ‘కాలేజీ..ఏ క్యాజీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్య విద్యా సంచాలకుల విభాగం స్పందించింది. ఈ మేరకు డాక్టర్ రమాదేవి, డాక్టర్ అనిల్‌కుమార్, డాక్టర్ నాగేందర్‌తో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ కర్మన్‌ఘాట్‌లోని మరో ఐదు అంతస్తుల భవనాన్ని ఇందుకు అనువైన ప్రదేశంగా గుర్తించింది. అద్దె చెల్లింపులపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తికానుంది. ఆ వేంటనే ప్రస్తుత క్యాంపస్‌ను ఖాళీ చేసి, కొత్తగా ఎంపిక చేసిన భవనంలోకి మార్చనున్నారు. దీంతో కాలేజీ, అనుబంధ ఆస్పత్రి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లకు తగ్గిపోనుంది. ఈ కొత్త భవనంలోనే విద్యార్థులకు వసతి కల్పించే అవకాశం ఉంది.
అధిక చెల్లింపులపై నోటీసులు
సాధారణంగా గృహ సముదాయ భవనానికి చెల్లించే అద్దైపె ఏటా ఐదు శాతం పెంచుకునే అవకాశం ఉంది. అదే కమర్షియల్ భవనం అద్దెను పది శాతం పెంచుకోవచ్చు. కానీ మహేశ్వరం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏకపక్షంగా ఇప్పటికే 15 శాతం పెంచి, అదనంగా చెల్లిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ సహా కలెక్టర్ అనుమతి లేకుండా నిర్దేశిత అద్దెకు మించి చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వ ఫైనాన్స్ విభాగం తప్పుబట్టింది. ఇదే అంశంపై ప్రిన్సిపాల్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది. ఒకవైపు అక్రమ చెల్లింపులపై విచారణ కొనసాగుతుండగా, మరోవైపు ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దైపె 20 శాతం అదనంగా చెల్లించాలని భవన యజమాని స్పష్టం చేశారు. బహిరంగ మార్కె ట్లో ఎక్కడా లేని విధంగా అద్దె చెల్లించి.. అసౌకర్యాల మధ్య ఉండటం కంటే.. ప్రస్తుత భవ నాన్ని ఖాళీ చేసి, మరో కొత్త అద్దె భవనంలోకి వెళ్లడమే ఉత్తమమని వైద్యశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో భవనం పరిశీలన, ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా కమిటీ కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు అద్దె భవనాన్ని పరిశీలించింది. అద్దె చెల్లింపులపై భవన యజ మానితో ఒప్పందం కుదరడమే ఆలస్యం తరగతులు సహా వసతి ఇక్కడే లభించనుంది.
‘సాక్షి’ కథనంతో వైద్య విద్యలో కదలిక
మహేశ్వరం మెడికల్ కాలేజీ షిఫ్ట్
మరో ఐదు అంతస్తుల అద్దె భవనం పరిశీలన
అద్దె చెల్లింపులపై స్పష్టత రాగానే మార్పు
18 నుంచి 4 కిలోమీటర్లకు తగ్గనున్న దూరభారం
తీరనున్న వైద్య విద్యార్థులు, అధ్యాపకుల కష్టాలు
కొత్తపేటలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) భవన నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. రూ.668 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల సామర్థ్యంతో 27 అంతస్తులు.. 123 మీటర్ల ఎత్తు సహా 11.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్పత్రికి అంత ఎత్తయిన భవనం అవసరం లేదని భావించింది. ఎత్తును 27 నుంచి 11 అంతస్తులకు తగ్గించింది. ప్లంబింగ్, కరెంట్ లైన్లు, డ్రైనేజీ వ్యవస్థ, డోర్లు, కిటికీలు వంటి ఇంటిరీయర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. నిజానికి మహేశ్వరం మెడికల్ కాలేజీకి మీర్‌ఖాన్‌పేటలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వంద ఎకరాలు కేటాయించింది. భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేసింది. వైద్య విద్యకు ఇది ఏమాత్రం అనువైన ప్రాంతం కాదని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. మీర్‌ఖాన్‌పేట నుంచి మంగళ్‌పల్లిలోని ఓ అద్దె భవనంలోకి మార్చింది. ప్రస్తుతం ఆ భవనంతో కుదుర్చుకున్న అద్దె గడువు ఒప్పందం కూడా ముగియడం, తాత్కాలికంగా కర్మన్‌ఘాట్‌లోని అద్దె భవనంలోకి మార్చి, ఆ తర్వాత కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్‌లోకి మార్చాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తోంది.


