సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) గడువు ఈనెల 10 వరకు పొడిగించిన నేపథ్యంలో లభించిన అదనపు సమయాన్ని పూర్తిగా నాణ్యత పెంపునకు వినియోగించాలని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు కె.కిరణ్మయి, చంద్రారెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. జిల్లాలో నిర్వహి స్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై విశ్వాసాన్ని పెంచాయని ప్రశంసించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను జాగ్రత్తగా చేపట్టాలని, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు గుర్తించలేకపోతున్నామని, బీఎల్‌వోలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. బీఎల్‌వోలు ప్రజలకు పూర్తి సహకారం అందిస్తూ, ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఆయన అదనపు కలెక్టర్ కె.కిరణ్మయితో కలిసి కొంగర, బొంగులూరు, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.
63.53 శాతం మ్యాపింగ్ పూర్తి
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 63.53 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టు చెప్పారు. పెండింగ్ మ్యాపింగ్, అనామలీస్, డూప్లికేట్, నో మ్యాపింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో ఇప్పటికే విస్తృత సమావేశాలు నిర్వహించి అపోహలు తొలగించామని, అవసరమైతే మరోసారి ఈఆర్‌వో స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
గడువులోగా పూర్తి చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: నిర్ణీత గడువులోగా సర్ కార్యక్రమం పూర్తి చేయాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఆదేశించారు. కొంగరకలాన్, బొంగ్లూర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన అదనపు కలెక్టర్ కిరణ్మయి, డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి జయచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, దరఖాస్తుల పరిశీలన, రికార్డుల నిర్వహణ, ఫీల్డ్ వెరిఫికేషన్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేక ఓటరు సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీత, ఆదిభట్ల డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఎల్‌ఓలు అందుబాటులో లేరనే ఫిర్యాదులు రావొద్దు
ఇప్పటివరకు జిల్లా అధికారుల కృషి భేష్
కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌కుమార్
ఓటరు జాబితా సమగ్ర సవరణపై సమీక్ష


