హయత్‌నగర్: టీఎస్ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్‌లుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హయత్‌నగర్–1 డిపో మేనేజర్ లావణ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెవీ వాహన లైసెన్స్ కలిగి ఉండి కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోను జత చేసి ఈనెల 8వ తేదీలోపు డిపోలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
షాబాద్: ఇటీవల మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరామర్శించారు. షాబాద్‌లోని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి నివాసంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇన్‌చార్జి పామెన భీంభరత్, పెంటారెడ్డి, మద్దూరు మల్లేష్, సర్పంచులు అశోక్, రవికుమార్, నర్సింలు, శ్రీరాంరెడ్డి, చెన్నయ్య రుక్కమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, శ్రీరాంరెడ్డి, మల్లేష్, దేవేందర్‌రెడ్డి, అరీఫ్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరు: కొత్తూరు పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా నాగార్జునరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వర్తించిన నర్సయ్య ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్లారు.
ఇబ్రహీంపట్నం: దండుమైలారం గ్రామంలో ఆక్రమణకు గురైన గ్రామకంఠం భూ సాధనే లక్ష్యంగా చేస్తున్న రిలే దీక్షలు శనివారానికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో ఆక్రమణకు గురైన గ్రామ కంఠం భూమిని విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ ఈదులకంటి నరేష్‌గౌడ్ దీక్షలు చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించాడు.


