చిలుకూరులో ‘వేణునాదం’ | - | Sakshi
Sakshi News home page

చిలుకూరులో ‘వేణునాదం’

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

చిలుకూరులో ‘వేణునాదం’ ‘ప్రైవేటు’లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సమాజాభివృద్ధికి విద్య బలమైన పునాది రక్తదాతకు గవర్నర్‌ ప్రశంస

మొయినాబాద్‌: జేష్ట అమావాస్య సందర్భంగా ఆదివారం చిలుకూరు బాలాజీ దేవాలయంలో ‘వేణునాదం’ సంగీత కార్యక్రమం నిర్వహించారు. సమాజ శ్రేయస్సు, ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ ‘వేణునాదం’ పేరుతో దివ్య వేణుగానం కార్యక్రమం చేపట్టినట్టు చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు. సనాతన ధర్మంలో సంగీతాన్ని దైవారాధనకు శ్రేష్ట సాధనంగా భావిస్తారని.. ఆ సంప్రదాయానికి అనుగుణంగా వేణునాదం నిర్వహించామని చెప్పారు. సంగీత కళాకారులు అనంత కృష్ణ తన మధురమైన వేణుగానంతో భక్తులను పరవశింపజేశారు. ఆయనకు వెంకట నాగ సాయి శర్మ మృదంగం, పవన్‌ సింగ్‌ వయోలిన్‌తో సహకారం అందించారు.

షాద్‌నగర్‌: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు విక్రయించే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బేగరి మహేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు విక్రయిస్తున్నారని అన్నారు. విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అధనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లు, పుస్తకాల దందాను అరికట్టాలన్నారు. విద్యను లాభార్జన సాధనంగా మార్చడం సమాజానికి హానికరమన్నారు. విద్యాశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఇబ్రహీంపట్నం: సమాజాభివృద్ధికి విద్య బలమైన పునాది అని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కురుమ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన కురుమ విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం, నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కురుమలంతా ఐకమత్యంతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్యామ మల్లేష్‌ మాట్లాడుతూ.. కురుమలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర షిప్‌ అండ్‌ గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సరితతిరుపతయ్య, ది మిషన్‌ వ్యవస్థాపకుడు, ఎకై ్సజ్‌ సీఐ ఏడుకొండలు, ప్రముఖ ఇంపాక్ట్‌మోటివేషనల్‌ స్పీకర్‌ గాజుల శేఖర్‌, ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు శ్రీశైలం, జంగయ్య, బీరప్ప, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతగిరి: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 118వ సారి రక్తదానం చేసిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సాయి చౌదరిని ఆదివారం హైదరాబాద్‌లో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అభినందించారు. యువత దేశానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో సైతం రక్తదానం చేయడానికి ముందుకు వస్తానని సాయి చౌదరి పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement