● సందర్శించిన ఎండీ అశోక్ రెడ్డి
● అప్రమత్తంగా ఉండాలని సూచన
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు హిమాయత్ సాగర్ జలాశయంలోకి 800 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఉస్మాన్ సాగర్ జలాశయానికి కూడా ప్రవాహాలు ప్రారంభమైనట్లు జలమండలి అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయాల్లోకి వస్తున్న ప్రవాహాల పరిమాణం, నీటి మట్టాల పరిస్థితిని జలమండలి సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జలాశయాల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి సూచించింది. ఆదివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హిమాయత్ సాగర్ జలాశయాన్ని సందర్శించారు. వరద సన్నద్ధత చర్యలు, కార్యాచరణ ప్రణాళికలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే ఏర్పాట్లను సమీక్షించారు. జలాశయాల్లోని నీటి మట్టాలు, క్యాచ్‌మెంట్ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహాలు, నీటి నాణ్యతకు సంబంధించిన టర్బిడిటీ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలతో సమన్వయంగా చేసుకోవాలని సూచించారు.
ఉస్మాన్ సాగర్
పూర్తి స్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు
(3.518 టీఎంసీ)
ప్రస్తుతం నిల్వలు 1784.30 అడుగులు
(2.493 టీఎంసీ)
హిమాయత్ సాగర్
పూర్తి స్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు
(2.521 టీఎంసీ)
ప్రస్తుత నిల్వలు 1760.60
(2.110 టీఎంసీ)
ఇన్‌ఫ్లో 800 క్యూసెక్కులు


