ఇబ్రహీంపట్నం రూరల్: ఓ ప్రార్థన మందిరంలోకి వెళ్లి ఓ వ్యక్తిని చితకబాదడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బొంగ్లూర్ సమీపంలోని సప్తగిరి కాలనీలో ఉన్న ఓ ప్రార్థన మందిరంలో ఆదివారం కొంత మంది ప్రార్థన చేస్తుండగా హిందూ వాహిని సంఘాల సభ్యులు వెళ్లి అడ్డుకున్నారు. ఘటనను చిత్రీకరిస్తున్న రాజు అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించి నర్సింహారెడ్డి, రోహిత్, వేణుపై ఫిర్యాదు చేశాడు. ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ, హిందు వాహిని సంఘాలు నాయకులు పెద్ద సంఖ్యలో ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నాకు దిగారు. అరెస్టు చేసిన ముగ్గురినీ వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. పోలీసులు ఆందోళనకారులను సముదాయించి పంపించారు.
పెళ్లి చేసుకోవాలంటూ వివాహితకు వేధింపులు
ఫిలింనగర్: తనను పెళ్లి చేసుకోవాలంటూ వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా అంకిరావుపల్లె గ్రామానికి చెందిన డేగరాజు (25), ఫిలింనగర్‌లో నివాసముంటున్న ఒక వివాహిత (24)ను కొంతకాలంగా ఫోన్ ద్వారా వేధిస్తూ అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడు.తన భర్తను విడిచిపెట్టి తనతో రావాలని, పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన కదలికలను గమనిస్తూ, దారిపొడవునా అడ్డగిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు డేగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● ముగ్గురిపై కేసు నమోదు
● ఆదిబట్ల ఠాణా ఎదుట హిందూ సంఘాల ధర్నా


