సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్లలో 913 వాటర్ లాగింగ్ ఏరియాలను గుర్తించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన తొలకరి వర్షానికి నగరం నీట మునిగిందని.. ఊహించని విధంగా పడుతున్న వర్షాలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలన్నారు. శుక్రవారం డీఆర్‌ఎఫ్ బృందాలతో ఆయన భేటీ అయ్యారు. వర్షాకాల సన్నద్ధతపై వారికి దిశానిర్దేశం చేశారు. వర్షం పడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయనే దానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో 257 తీవ్రమైన సమస్య ఉన్న ప్రాంతాలు ఉన్నాయని, ఆ పాయింట్ల వద్ద డీఆర్‌ఎఫ్ బృందాలు అనునిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. 51 డీఆర్‌ఎఫ్ టీమ్స్‌కు తోడు త్వరలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (మెట్), స్టాటిక్ టీమ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. వర్షాకాలంలో తలెత్తే సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సహకారం తీసుకోవాలని హైడ్రా కమిషనర్ డీఆర్‌ఎఫ్ బృందాలకు సూచించారు. మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద స్థానికులతో కలసి కమిటీలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంలో వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ నెల 9న ఒక్కసారిగా కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాల పైనా రంగనాథ్ సమీక్షించారు. ఒక్క రోజు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తితే రూ.400 కోట్ల వరకూ నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేశారని వివరించారు. అదనపు సంచాలకులు వర్ల పాపయ్య, అడిషనల్ కమిషనర్ ఆర్.సుదర్శన్ వర్షాకాల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు.
వర్షాకాల సన్నద్ధతపై డీఆర్‌ఎఫ్ బృందాలకు రంగనాథ్ దిశానిర్దేశం


