అనంతగిరి: రైలులో అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు, ఈగల్ టీం బృందం పట్టుకుంది. రైల్వే సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీజిత్ ముంబైలో జీవనం సాగిస్తున్నాడు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి చెందిన అమేష్ పంగి, సుమన్ చంద్ర, శ్యామ జరేల్, సుధీర్ ఖారాతో పరిచయం ఏర్పడింది. ఈ నలుగురు తాగుడుకు అలవాటు పడి గంజాయి విక్రయించడం మొదలు పెట్టారు. మల్కన్‌గిరి అడవుల్లో గంజాయి సేకరించి రోడ్డు మార్గంలో విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి భువనేశ్వర్ –ముంబై కోణార్క్ ఎక్సెప్రెస్ రైలులో బయలుదేరారు. గురువారం శంకర్‌పల్లి పరిసర ప్రాంతాల్లో రైలులో ఈగల్ టీం, మహబూబ్‌నగర్ రైల్వే ఎస్‌ఐ రాజు జనరల్ చెకింగ్ చేస్తుండగా వీరి వద్ద గంజాయి లభ్యమైంది. నిందితుల నుంచి 21.930 కిలోల గంజాయి, 5 మొబైల్స్ సీజ్ చేశారు. ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.10.96 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వికారాబాద్ రైల్వే పోలీసులు, ఈగల్ టీం బృందాన్ని రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ ఐజీ రమేష్ నాయుడు, రైల్వే ఇన్‌చార్జ్ ఎస్పీ సందీప్, ఎస్‌సీఆర్ డీఎస్‌ఆర్‌పీ శ్రీనివాస్‌రావు అభినందించారు.
బ్యాంకు ఉద్యోగులతో పోలీస్ కమిషనర్ సజ్జనర్
గన్‌ఫౌండ్రీ: ప్రతి బ్యాంకు ఉద్యోగి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజల ధనానికి బ్యాంకు ఉద్యోగులు రక్షకులు అనే విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేశారు. సమావేశంలో ఆర్‌బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయికుమార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు, బ్యాంక్ ఆఫ్ బరోడా బీనా వాహిద్, జోనల్ హెడ్ సుధాకర్, డీజీఎం ఆర్.మురళీకృష్ణ, సాయిబాబు పాల్గొన్నారు.


