● దేశవ్యాప్తంగా మేలో 74 మంది అరెస్టు
● అత్యధికులు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ నిందితులే
● 25 కేసుల్లో రూ.68 లక్షలు బాధితులకు రీఫండ్
● వివరాలు వెల్లడించిన అదనపు సీపీ శ్రీనివాసులు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కేసులకు సంబంధించి మే నెలలో దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్స్‌లో 74 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసుల్లో నిందితులే ఉన్నట్లు అదనపు సీపీ శ్రీనివాసులు శుక్రవారం ప్రకటించారు. మరోపక్క 25 కేసుల్లో బాధితులు కోల్పోయిన మొత్తంలో రూ.68.27 లక్షలు రీఫండ్ చేసినట్లు వివరించారు.
● ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌లో 33 మంది, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్‌లో 12 మంది, ట్రేడింగ్ ఫ్రాడ్స్‌లో ఏడుగురు, ఓటీపీ ఫ్రాడ్స్‌లో ఐదుగురు, సోషల్ మీడియా కేసుల్లో నలుగురు, జాబ్–ఏపీకే ఫ్రాడ్స్‌లో ముగ్గురు చొప్పున, లోన్‌ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టు ఫ్రాడ్స్‌లో ఇద్దరు, డేటింగ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్‌లో ఇద్దరు చొప్పున, కస్టమర్ కేర్, బిజినెస్ ఫ్రాడ్స్‌లో ఒకరు చొప్పున అరెస్టు అయ్యారు.
● నిందితుల్లో తెలంగాణకు చెందిన వారు 19 మంది, ఏపీకి చెందిన వారు 16 మంది, కర్ణాటక నుంచిఆరుగురు, యూపీ నుంచి ఏడుగురు, తమిళనాడు, గుజరాత్‌ల నుంచి ఐదుగురు చొప్పున, మహారాష్ట్ర నుంచి నలుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు, ఒడిశా నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
● వీరినుంచి పోలీసులు 43 మొబైల్ ఫోన్లు, 32 సిమ్ కార్డులు, 19 ల్యాప్‌టాప్‌లు, పదుల సంఖ్యల బ్యాంక్ పాస్‌బుక్స్, ఓ చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు.
● నర్మదా సాగర్ కంపెనీ పేరిట సీడ్స్ తయారీ
● ముగ్గురు నిందితుల అరెస్టు
● రూ.30 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: గుజరాత్‌కు చెందిన నర్మదా సాగర్ కంపెనీ పేరుతో నకిలీ సీడ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టు చేశారు. న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ ఎండీ యెరువ బాలశౌరి రెడ్డితో పాటు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ పేరుతో విత్తన వ్యాపారం చేస్తున్న బాలశౌరి.. గ్రాఫిక్ డిజైనర్లు కపర్తి బెంజిమెన్, దొంగ శ్రీనుల సహాయంతో గుజరాత్‌కు చెందిన నర్మదా సాగర్ కంపెనీని పోలిన పౌచ్ డిజైన్ తయారు చేయించాడు. మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లిలోని ’ట్రూప్యాక్ ఫ్లెక్సిబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ లో వీటిని ముద్రించారు. సుమారు 2 వేల కిలోల నకిలీ విత్తనాలను బండ్లగూడలోని తన ఆఫీసులో నిల్వ ఉంచాడు. వీటిని నకిలీ పౌచ్‌లలో ప్యాక్ చేసి విక్రయించడమే వీరి లక్ష్యం. ఈ మేరకు నర్మదా సాగర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ సోలంకే యశ్వంత్ రావు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు బోయినపల్లి వెజిటబుల్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్నారని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల పౌచ్‌లు, బండ్లగూడలోని ఆఫీసులో రూ.30 లక్షలు విలువైన 2 వేల కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బాలశౌరి రెడ్డిపై గతంలో షాద్‌నగర్, రాజేంద్రనగర్, మహబూబ్‌నగర్‌లోని భూత్‌పూర్ ఠాణాలలో కేసులున్నాయి.


