పట్టు వీడని కాళ్లాపూర్‌ రైతులు | - | Sakshi
Sakshi News home page

పట్టు వీడని కాళ్లాపూర్‌ రైతులు

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

● రెండో రోజు కొనసాగిన ఆమరణ నిరాహార దీక్ష ● మద్దతు తెలిపేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అరెస్ట్‌

పరిగి: ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కాళ్లాపూర్‌ రైతులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. భూములు ఇచ్చేది లేదని మరోమారు స్పష్టం చేశారు. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఆత్మహత్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. దీక్ష విరమించాలని పోలీసులు కోరినా రైతులు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. చావనైనా చస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమని తెగేసి చెప్పారు. మాకు ఎలాంటి పరిశ్రమలు వద్దని పొలాలు ఉంటే చాలన్నారు. పోలీసులు గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు వాటిని తొలగించారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని రైతులు స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అరెస్ట్‌

రైతులకు మద్దతు తెలిపేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని పరిగి పోలీసులు రంగాపూర్‌ గేట్‌ వద్ద అడ్డంగించి అదుపులోకి తీసుకున్నారు. దీంలో పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహేశ్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులను చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతుల కోసం వెళ్తుంటే అక్రమంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని ఆరోపించారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు.

మహేశ్‌రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

దీక్షలో కూర్చున్న కాళ్లాపూర్‌ రైతులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement