డంపింగ్‌యార్డును తరిమికొడదాం | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌యార్డును తరిమికొడదాం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌: నగర శివారులోని బండరావిరాల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఎకోటౌన్‌ పేరుతో ఏర్పాటు చేయనున్న డంపింగ్‌ యార్డును తరిమి కొట్టాలని అబ్దుల్లాపూర్‌మెట్‌, భూదాన్‌పోచంపల్లి మండలాలకు చెందిన పలువురు సర్పంచులు, రాజకీయ పార్టీ నేతలు ప్రతినబూనారు. బండరావిరాల సర్వేనంబర్‌ 268లోని ప్రభుత్వ భూమిలో డంపింగ్‌ యార్డును నెలకొల్పేందుకు సర్కారు జపాన్‌కు చెందిన ఓ కంపెనీకి స్థలం కేటాయించిందని ఇటీవల వచ్చిన వార్తా కథనాలతో ఆయా గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం చిన్నరావిరాలలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో అన్ని పార్టీల నాయకులు, ఆయా గ్రామస్తులతో సమావేశం(అఖిలపక్షం) ఏర్పాటు చేశారు.

పోరాటానికి సిద్ధం కావాలి

సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డును వ్యతిరేకించకపోతే బండరావిరాల, చిన్నరావిరాల, తారామతిపేట, గౌరెల్లి, బాచారం, సద్దుపల్లి, బలిజగూడ, అబ్దుల్లాపూర్‌మెట్‌, కవాడిపల్లి, దేశ్‌ముఖి, పిలాయిపల్లి, పెద్దగూడెం, పోచంపల్లిలోని మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలు, పీల్చే గాలి కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన దుర్వాసనతో ఈగలు, దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇక్కడి గ్రామాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, ఇప్పటికే క్రషర్లతో కొంత మేర సాగుకు ఇబ్బందులు ఉన్నాయని, ఈ డంపింగ్‌ యార్డుతో కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదముందన్నారు. మన గ్రామాలను, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అన్యాయాన్ని ఎదురించి పోరాడటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని భీష్మించారు. డంపింగ్‌ యార్డు వ్యతిరేక పోరాటం కోసం త్వరలోనే బాధిత గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో జేఏసీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల సర్పంచులు విజయ్‌కుమార్‌, బాలకిషన్‌గౌడ్‌, మాధవీనవీన్‌, పోచంపల్లి మండల సర్పంచులు జంగయ్యయాదవ్‌, మహాలక్ష్మిదానయ్య, మహేశ్‌యాదవ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దాసుగౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్‌, బీజేపీ నేతలు నవీన్‌కుమార్‌, సురేష్‌గౌడ్‌, కొండల్‌గౌడ్‌, వివిధ సంఘాల నేతలు వెంకటేశ్‌, అరుణ్‌కుమార్‌, మహేందర్‌, లింగారెడ్డి, అశోక్‌యాదవ్‌, సతీష్‌రెడ్డి, బసవయ్య, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎకోటౌన్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షం సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement