షాబాద్: మండల పరిధిలోని మాచన్‌పల్లి కట్ట మైసమ్మకు గ్రామస్తులు బోనాలు ఘనంగా సమర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రాంరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయం వద్ద బారులు తీరి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా తరలివచ్చి నైవేద్యాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నాయకలు, కార్యకర్తలు, తదితరులున్నారు.
పంట మార్పిడితో నేలకు మేలు
ఇబ్రహీంపట్నం రూరల్: తక్కువ యూరియాను వాడి సాగు ఖర్చులు తగ్గించుకోవాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంభాలపల్లి గురునాథ్‌రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని కప్పపహాడ్‌లో ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ రసాయనిక ఎరువులు వాడి భూసారాన్ని, నేల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. అవసరం మేరకు మాత్రమే రసాయనిక ఎరువులు ఉపయోగించాలన్నారు. ప్రకృతిని పరిరక్షించడం, పంట మార్పిడి ద్వారా సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చన్నారు. అంతకుముందు రైతులకు వివిధ అంశాలను డాక్టర్ జగన్మోహన్‌రెడ్డి, డాక్టర్ వరప్రసాద్, చంద్రమోహన్ వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ డాక్టర్ యాదాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి ఉష, ఏడీ సుజాత, ఏఓ విద్యాధరి, సర్పంచ్ గీత, ఉప సర్పంచ్ రమేష్, ఉద్యాన అధికారి నవీన, ఏఈఓ శ్రవణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
బాలిక ఆత్మహత్య.. నిందితుడికి రిమాండ్
బంట్వారం: బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించామని కోట్‌పల్లి ఎస్‌ఐ శైలజ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన ప్రకారం.. కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లికి చెందిన కాళ్ల సాకేత్.. బాలికను ప్రేమపేరుతో వేధించేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన బాలిక.. ఈ నెల 23న పురుగు మందు తాగి బలవన్మరణానికిపాల్పడింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 25న మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
గృహిణి ఆత్మహత్య కేసులో ఇద్దరికి..
యాలాల: భర్త, తోటికోడలు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన గృహిణి కేసులో ఇద్దరిని సోమవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన జటంగి దేవి(33)ని, ఆమె భర్త హన్మంతు నిత్యం మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఈ నెల 13న డబ్బుల విషయంలో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన ఆమె గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 21న మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు.. దేవి మృతికి కారణమైన హన్మంతు, తోటి కోడలు సావిత్రమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


