అబ్దుల్లాపూర్‌మెట్: ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేవడ గ్రామానికి చెందిన పొడుగు ఈశ్వరమ్మ, యెరుకులు దంపతులు కుటుంబసభ్యులతో కలిసి కొంతకాలంగా అనాజ్‌పూర్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీకి చెందిన సహారా క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. ఫిల్మ్‌సిటీలో పనిచేస్తున్న వారి చిన్న కుమారుడు ఏసుకుమార్(24) ఈ నెల 21వ తేదీన పనికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూడగా ఏసుకుమార్ కనిపించకపోవడంతో పాటు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆచూకీ కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా, ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
దోమ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేశారు. మండల పరిధి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అలవోని తిరుపతి.. తన వాహనంలో రాకొండ వైపునకు ఇసుక తీసుకెళ్తుండగా.. నమ్మదగిన సమాచారంతో పోలీసులు ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని ఠాణాకు తరలించారు. తిరుపతిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వసంత్ జాదవ్ హెచ్చరించారు.
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్: అనారోగ్యంతో బాధ పడుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్ పోలీసులు తెలిపిన మేరకు.. కామారెడ్డి జిల్లా వెల్లగనూర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు రాజేందర్‌రెడ్డి (23) మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ స్థానికంగా ఉన్న వెంకట సాయిలక్ష్మీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం రాజేందర్‌రెడ్డి హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా అస్తమాతో బాధపడుతున్న అతను చికిత్స పొందుతున్నాడు. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళల పరార్
జగద్గిరిగుట్ట: ఆల్విన్ కాలనీలో ఉన్న రెస్క్యూ హోం (పునరావాస కేంద్రం) నుంచి ఆదివారం ఏడుగురు మహిళలు పరారయ్యారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో వీరిని కౌన్సిలింగ్‌లో భాగంగా ఇటీవలే రెస్క్యూ హోమ్‌కు తీసుకు వచ్చారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ రావడంతో మెయిన్ గేట్ తెరిచారు. ఆ సమయంలో మొత్తం 9 మంది మహిళలు పరారవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఏడుగురు సిబ్బంది కళ్లు గప్పి పరారయ్యారు. సిబ్బంది అప్రమత్తమై మరో ఇద్దరిని పట్టుకున్నారు. రెస్క్యూ హోం నిర్వాహకురాలు నీలిమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వీడియో కాల్స్‌తోమహిళకు వేధింపులు
కుషాయిగూడ: అసభ్యకరంగా న్యూడ్ వీడియో కాల్స్‌తో నిత్యం వేధిస్తున్నాడని ఓ మహిళ సోమవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మార్చి నెల నుంచి పలు ఫోన్ నెంబర్లతో వీడియో కాల్స్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాధులో పేర్కొంది. నిందితుడిని త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


