కడ్తాల్: జిల్లాలోని కడ్తాల్, మైసిగండి, ఆమనగల్లు, షాద్‌నగర్, మహేశ్వరం పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి వేతన కూలీల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్మికులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్‌కుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలల దినసరి వేతన కూలీలు మాట్లాడుతూ.. గత 13 నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. రికార్డుల్లో లోపాలు ఉండటంతో జీతాలు అందడంలేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. అనంతరం గిరిజన సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ దిలీప్‌కుమార్‌లు.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లో జీతాలు కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కూలీలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్, దినసరి వేతన కూలీలు సైదమ్మ, సంతోష, శోభ, చంద్రకళ, బుజ్జి, మస్రూ, సునీత, రాములు, భూదేవి, సత్యమ్మ, అలివేలు, స్వరూప, లక్ష్మి, మల్లమ్మ తదితరులు ఉన్నారు.


