చోరీ కేసులో కేటుగాడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో కేటుగాడి అరెస్టు

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

షాద్‌నగర్‌రూరల్‌: మాయమాటలు చెప్పి బంగారంతో ఉడాయించిన ఓ కేటుగాడిని పోలీసులు కటకటాలకు తరలించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఎస్‌ఐ శివారెడ్డి సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామానికి చెందిన నరేష్‌ ఈ నెల 18న హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వస్తుండగా బస్సు కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భిక్షపతి బస్టాప్‌లో నరేష్‌ దగ్గరకు వచ్చి ఉద్యోగం ఖాళీగా ఉందని, ఇప్పిస్తానని, మరిన్ని విషయాలు మాట్లాడుకుందామని లాడ్జికి తీసుకెళ్లాడు. ఇద్దరు మాట్లాడుతుండగా వాష్‌ రూంకు వెళతానని నరేష్‌ చెప్పడంతో మెడలోని చైన్‌, చేతి ఉంగరాలను తీసిపెట్టి వెళ్లాలని భిక్షపతి సూచించాడు. దీంతో నరేష్‌ తన మెడలో చైన్‌, చేతికి ఉన్న నాలుగు ఉంగరాలను తీసిపెట్టి వాష్‌రూంకు వెళ్లాడు. నరేష్‌ బయటకు వచ్చేలోపు భిక్షపతి గది బయట నుంచి గడియపెట్టి బంగారంతో ఉడాయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించి భిక్షపతిని అరెస్టు చేసి విచారించగా.. నేరం అంగీకరించాడు. నిందితుడి నుంచి బంగారు చైన్‌, 4 ఉంగరాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మినారాయణ, పట్టణ సీఐ సీతారం పర్యవేక్షణలో డీఎస్‌ఐ శివారెడ్డి, క్రై సిబ్బంది కేసును ఛేదించారు.

Advertisement
 
Advertisement
Advertisement