మంచాల: ప్రొటోకాల్ పాటించకుండా పనులకు అడ్డుతగిలి, తనను అవమాన పర్చిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆగపల్లి సర్పంచ్ లకుమల్ల ఉమ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25న గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వచ్చారన్నారు. కొన్ని పనులు ప్రారంభించిన తర్వాత సమయాభావంతో ఆయన వెళ్లిపోయారని, మిగిలిన వాటిని సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రారంభించాలని సూచించారన్నారు. అనంతరం గ్రామంలో ఓ ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి వెళ్లిన తనను ఏర్పుల సంజీవ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కాలితో తన్నడంతో పాటు కత్తెర లాక్కొని రిబ్బర్ కట్ చేశారని ఆరోపించారు. ప్రొటోకాల్ పాటించకుండా, మహిళా సర్పంచ్‌నైన తనను అవమానించిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.


