బడంగ్‌పేట్: పాట్ ఖరాబ్ భూములుగా చెప్పి కబ్జా చేయడం దుర్మార్గమని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా పేర్కొన్నారు. నాదర్‌గుల్ రెవెన్యూలో రైతులు సాగు చేసుకుంటున్న 374 ఎకరాల భూమిని పరిశీలించారు. బౌన్సర్లు, రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారని రైతులు ఆయనతో చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. కబ్జా భూములపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కబ్జాకు గురైనా నాదర్‌గుల్ పేదల భూములను వారికే ఇచ్చేలా ప్రభుత్యం చర్యలు తీసుకోవాలన్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించడానికి ప్రభుత్వం సుప్రీం కోర్టులో గట్టిగా వాదించే న్యాయవాదులను నియమించాలని కోరారు. సుప్రీంకోర్టు ద్వారానే కమిషన్‌ను నియమించి ఈ భూములు పాట్ ఖరాబ్ భూములా లేక వ్యవసాయ భూములా తేల్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


